అదొక ఆవారా బ్యాచ్. చదువులు ఎగ్గొట్టిన జులాయి బ్యాచ్. వాళ్ళొకరోజు గ్రాండ్‌పార్టీ చేసుకున్నారు. మందు.. విందు.. పొందు! తిన్నంత తిని, తాగినంత తాగి.. కాల్‌గాళ్స్‌తో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి అలసిపోయారు. బాగా కష్టపడిపోయి అడ్డదిడ్డంగా దున్నపోతుల్లాపడి నిద్దరోతున్నారు. అప్పటికి అర్థరాత్రి దాటిపోయింది. వాళ్లు తీసుకొచ్చుకున్న కాల్‌గాళ్స్‌లో ఒకమ్మాయి ఎవరో పిలిచినట్లు దిగ్గున లేచింది.. ఇంట్లో ఆ గదిలోకి.. ఈ గదిలోకి తిరిగింది.. సరిగ్గా అదే సమయంలో ఓ కుర్రాడికి మెలకువ వచ్చింది. ఆమె చేస్తున్న పనిని ఓరకంట చూశాడు.. ఏవేవో మూటకట్టుకుని.. ముసుగేసుకుని ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్లగానే.. ఆ యువతిని సీక్రెట్‌గా ఫాలో అయ్యాడు... అదే అతడి జీవితాన్ని మార్చేసింది.. ఆమె చేయిని జీవితాంతం పట్టుకునేలా చేసింది.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
************************
నా పేరు మునిరత్నం.అందరూ నన్ను ‘మునియ్యా’ అంటారు. మాది నెల్లూరు.రాధికా విలాస్ హోటల్లో సీనియర్ సూపర్‌వైజర్ నేను. హోటల్ యజమాని సుబ్బారెడ్డిగారు కూడా మా నెల్లూరాయనే! మా నెల్లూరు కనకమహల్ సినిమాహాలు సెంటర్లో హోటలు పెట్టినప్పటినుంచీ నాకు ఆయన తెలుసు. నేనంటే అభిమానంగా ఉంటాడు.మా అమ్మాయి, అల్లుడూ ఉజ్జోగాలు చేసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉంటున్నాగానీ, నేను వాళ్ళింట్లో ఉండను. నా మకాం మా హోటల్లోనే.ఇవాళ నైట్‌డ్యూటీ. బాలానగర్‌లో అవుట్‌సైడ్ క్యాటరింగ్ చెయ్యాలి.
‘శ్రీరస్తు–శుభమస్తు’ ఫంక్షన్‌హాల్లో మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌వాళ్ళు చాలాగ్రాండ్‌గా ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మీల్స్ క్యాటరింగ్ సబ్ కాంట్రాక్ట్ మాదే.పెళ్ళిభోజనాలు పూర్తై మా మీల్స్ సెక్షన్ క్లోజయ్యేసరికి రాత్రి పదిన్నర దాటిపోయింది.మిగతా స్టాల్స్ సంగతేమోగానీ, మా సెక్షన్లో చాలాఫుడ్ మిగిలిపోయింది.రాత్రి ఏడింటినుంచీ ఒకటే వాన. ఇక అంతే! ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు. మన హైదరాబాద్ గురించి తెలియనిదెవరికి! చాలామంది మ్యారేజ్ డిన్నర్‌కి రాలేదు. వచ్చినోళ్లల్లో చాలామంది ఫ్యామ్లీస్‌తో, పిల్లల్ని వెంటబెట్టుకొచ్చారు. పిల్లకాయలేంతింటారు? ఎంతసేపూ చాట్‌బండార్లమీదే ధ్యాస. ‘గప్‌చిప్’ పానీపూరీలూ, భేల్‌పూరీలూ, కట్‌లెట్లూ తెగతిన్నారు. ఐస్‌క్రీములైతే ఒక్కొక్కళ్లూ రెండుమూడేసి లాగించేశారు. పైగా ఇవాళ గురువారం. చాలామంది ఉపాసాలున్నోళ్లు పుల్కాలూ, పూరీలతో సరిపెట్టుకున్నారు.దాంతో మరో యాభైఅరవైమందికి సరిపడ ఆహారపదార్థాలు మిగిలిపోయాయి. నాకైతే ప్రాణం ఉసూరుమంది. మిగిలిపోయిన ఫుడ్ అంతా ఈవెంటోళ్లకి ఇచ్చేయాలి. వాళ్ళైనా ఏం చేసుకుంటారో తెలియదు. మా బిల్లు మాకొచ్చేస్తుంది. అంతవరకు దిగుల్లేదుగానీ, ఇంతాకష్టపడి, కమ్మగా చేసిన ఈ వంటలన్నీ ఎవరు తిన్నట్టు? అంతా వేస్టే కదా!నాకు బాధనిపించింది.
************************************
నేను మా రెడ్డిగారితో సెల్‌ఫోన్లో మాట్లాడుతుంటే, ఒకతను నాకోసమే అన్నట్లు నన్నే కాసుకుని నా పక్కనే నిలబడి ఉన్నాడు.