‘‘అర్జునా! దేవుడంటే మరీ పిసినిగొట్టు వాడనుకోకు. సృష్టిలో అందరూ నాకు సమానమే. ఎవ్వరికీ ఏ లోపం చేయాలని నాకెప్పుడూ ఉండదు. ప్రతివారూ రెండుపూటలా నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లతో సుష్టుగా భోంచేయాలన్నదే నా తపన. నువ్వు తినే ప్రతిదీ అరిగిస్తాను. నీకు బలాన్ని, వీర్యాన్ని, తేజస్సునూ ఇస్తాను. కానీ నువ్వే కక్కుర్తిపడి దిక్కుమాలినవన్నీ తిని, కడుపు చెడగొట్టుకుంటూ ఉంటావు. నీ ఇంద్రియాలకు అధిదేవతనై నిన్ను నేను మాటిమాటికీ హెచ్చరిస్తూనే ఉంటాను. నువ్వు పెడచెవిని పెడుతుంటావు...’’ అన్నాడు శ్రీకృష్ణుడు ఒకచేతిలో పిల్లనగ్రోవిని, రెండోచేత అభయముద్రను ఓపిగ్గా కంటిన్యూ చేస్తూ.‘‘బావా!

 నాకింకో డౌటు పీకుతోంది. నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లలో నీకే కూరంటే ఇష్టం? పప్పుతో మిళాయించినా, ఉత్తగా పోపేసి దింపేసినా ఏ కూర అన్నింటిలోనూ శ్రేష్టమైనది? ఏ కాయగూరతో పచ్చడి చేస్తే భగవంతుడివైన నువ్వు మెచ్చుకుంటావు?’’ మోకాళ్లపై నిలిచి ప్రార్థనగా అడిగాడు పాండవ మధ్యముడు.‘‘అర్జునా! అప్పుడే మనం పదిహేనో అధ్యాయంలోకి వచ్చేశాం. ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇంతకుముందే నీకు నా విశ్వరూపం చూపెట్టాను. అది చూశాక అయినా నీ అనుమానాలన్నీ పటాపంచలు కావాల్సింది. కానీ నువ్వేమో జడుసుకున్నావు. అందుకే ఏదైనా సూక్ష్మంలో మోక్షంలా ఉండాలని నా ప్రవచనం మరికొంచెం పొడిగించాను. ఇప్పుడు చెబుతున్నాను విను. పురుషోత్తముడైన నన్ను సూక్ష్మంలో ఎక్కడైనా చూడవచ్చు. హాయిగా చూడాలనుకుంటే దోసకాయలో చూడు. గమ్మత్తేంటంటే దాంట్లో అస్సలు ఫ్యాట్‌ ఉండదు.

వెయిట్‌ లాస్‌ కి చాలా మంచిది. పోతే దానిక్కూడా శివుడికి ఉన్నట్లే మూడుకళ్లుంటాయి. కాస్త వెనక్కి తిప్పిచూడు.అంబకం అంటే తండ్రి, కన్ను, బాణం అని మూడు అర్థాలున్నాయి. శివయ్య మూడు కన్నుల తండ్రి. ఆయన ధనుస్సుకు మూడు బాణాలుంటాయి. అవే అన్నము, వాతము, వర్షము. వైజ్ఞానిక శాస్త్రం వాటినే ద్రవ్యము, వేడిమి, నీరు అని చెబుతుంది. జీవుని దేహంలో ఈ మూడూ సమతౌల్యంగా ఉంచుతూ పుష్టిని కలగచేేసవాడే శివుడు.ఇడ, పింగళ, సుషుమ్న నాడులు మూడూ కలిసే భ్రుకుటి వద్ద ఆజ్ఞాచక్రం మేలుకుంటుంది. దోసకాయను తరిగి చూస్తే మూడోనేత్రం తెరుచుకుంటుంది. అలా మూడోనేత్రం తెరుచుకున్నందువల్లనే శివుడు మహోన్నతమైన గోలోకంలో నా దర్శనం పొందగలిగాడు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలనే నాలుగు వెరైటీల్లోనూ దోసకాయను వినియోగించినవారు మృత్యుంజయులవుతారని అప్పుడే శివుడు శాసనం చేశాడు. మిగిలిన ఏ కూరలో అయినా దైవాసుర సంపద్విభాగాలు ఉండవచ్చు. కానీ దోసకాయలో మాత్రం ఏ దోషాలూ లేవు. అది దైవికమైన విత్తనం.