ఏపాటు తప్పినా సాపాటు తప్పదన్నట్టు, ఏ లొల్లి తప్పినా పెళ్లి లొల్లి తప్పదు గదా! నేను మాత్రం పెళ్లంటూ చేసుకుంటే నాకు నచ్చిన సుందరాంగినే చేసుకుంటా. ఆ అందాల భామ కౌగిట్లో కరిగి స్వర్గం అంచులు చేరుకోవాలి. ఒకరికి ఒకరమై నల్లేరు మీద బండి నడకలా జీవనయానం సాగించాలి. ఊహల ఊయలలో ఊరేగుతున్నానని అమ్మకెలా తెలియాలి? అమ్మా, నాన్నలేమో ఎవరిపాట వారు పాడుతున్నారు.

అమ్మనేమో ‘‘శ్రీకాంతా! నీ చెల్లి పెళ్ళై రెండేళ్లైంది. నీకు ఉద్యోగం దొరికి మూడేళ్లైంది. మీ నాన్న రిటైరై సంవత్సరమైది. నాకు మోకాళ్ళ నొప్పులొచ్చి ఆర్నెల్లైంది. నువ్వు పెళ్ళి చేసుకొమ్మంటే వాగ్దానాల నాయకుడిలా టలాయిస్తున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగాఉందా?’’ నిర్మొహమాటంగా నిలదీస్తుంది.నేనేమో ‘‘నాకు అప్సర్సలాంటి అమ్మాయి కావాలి. కట్నం ఊసెత్తగూడదు’’ కండిషన్‌లో బిగించాలని చూస్తుంటాను.‘‘కట్నం వద్దంటే మీ నాన్న కర్ర అందుకుంటాడు. నీ కట్నం డబ్బుల మీద బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాడురా కన్నా!’’నాన్ననేమో ఏ ఊళ్లో ఎలాంటి పెళ్ళి సంబంధముందా, ఎంత కట్నమిస్తారో, ఏయే కానుకలప్పజెప్తారో ఏకరువు పెడుతుంటాడు. అంతేకాదు ‘‘వెళ్ళి అమ్మాయిని చూసొద్దాంరా బడుద్దాయ్‌.

నీ తోటి యువ కులు ఉద్యోగాలు లేకున్నా పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా ఉంటున్నారు’’ దబాయిస్తాడు ఆ దబాయింపులకు నేను లొంగుతానా?‘‘కట్నం కావాలంటే కుదరదు నాన్నా! నాకు నచ్చిన అమ్మాయితో మాత్రమే పెళ్ళిచెయ్యాలి’’ అని నేనంటే ఆయనూరుకోడు.‘‘మరి నీ చదువులు, ఉద్యోగం కోసం బోలెడంత ఖర్చైంది. ఆ ఖర్చులెలా రాబట్టుకోవాలటా?’’ వితంత వాదానికి దిగుతాడు.నాన్న దృష్టిలో కొడుకంటే బంగారు గుడ్లు అందించే కోడిపుంజు. నాన్నకు నచ్చచెప్పలేక, నాకు సముదాయించలేక అమ్మ సతమతమైపోతుంది.

‘‘కొడుకును చదివించింది కట్నం కోసం కాదు గదండీ’’ సున్నితంగా మందలించిందోసారి.అమ్మనాన్నల మాటకు విలువనివ్వాలనే సదాశయముతో ఐదారు సంబంధాలు అలవోకగా చూసొచ్చాను. ఏ ఒక్క అమ్మాయి కూడా నా ఊహల ఊయల నందుకోలేదు.చెల్లి వాసంతి సీమంతోత్సవానికి వాళ్లూరికెళ్లాము.బావకు పట్నంలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. రోజూ వెళ్లి వస్తుంటాడు. వాళ్లమ్మా – నాన్నలు, బంధువులంతా పల్లెటూళ్లోనే పల్లవిస్తున్నారు. సీమంతోత్సవం కూడా వాళ్ల పల్లెటూళ్లోనే ఏర్పాటు చేశారు.