‘‘......మీరు వేదిక మీదికి రాగానే పాదాలకు చుట్టుకోవాలని గజ్జలూ, పిడికిట్లో ఒదిగిపోవాలని చిరతలూ తొందర చేస్తాయి. ఆదిభట్ల ‘జానకీ శపథం’ కథాగానం కదంతొక్కడానికి రంగం సిద్ధమవుతుంది. మంచిగంధపు చెట్లనూ, మొగలిరేకుల పొదలనూ ఒరుసుకునే మారుతంలాగా అందులోని మారుతి పాత్ర భక్తి పరిమళాలు పంచిపెడుతుంది.
పద్యం, గద్యం పరవశిస్తాయి. పాటలు పరుగులు తీస్తాయి. పిట్టకథలతో గిలిగింతలు పెడుతూనే గుండె గూడు పట్లు కదిలించి, కన్నీరు పెట్టించడం- మీకు మాత్రమే సాధ్యం! ‘హరికథా పితామహ’ ఆదిభట్ల నారాయణదాసుగారికి మీరు అంతేవాసి కావడం మేం చేసుకున్న అదృష్టం..ఈ ఊరికే గర్వకారణం..’’అది బెలగాం సెంటర్ కి రెండుకిలోమీటర్ల దూరంలో పార్వతీపురం టౌన్లోని సీతారామస్వామి కోవెల సెంటర్. అక్కడి వేదికమీద నటుడు,దర్శకుడు బుచ్చిబాబు ఆ సన్మానపత్రం చదువుతున్నంతసేపూ చప్పట్ల వర్షం కురిసింది! ‘హరికథాగ్రేసర’ బిరుదాంకితులు, ‘సువర్ణఘంటా కంకణధారి’ రాంభట్ల సూరదాసుగారు, వారి శ్రీమతి లక్ష్మీనరసమ్మగారు షష్టిపూర్తి దంపతులై శాలువాల్లో, పూలదండల్లో మునిగిపోతున్నారు. ఊళ్ళోని పెద్దలు, కళాసంఘాలవారు ఆ దంపతుల్ని సన్మానించి, కానుకలతో సత్కరించి తమ అభిమానం వ్యక్తం చేసుకున్నారు.
సన్మాన సంఘం పక్షాన ప్రముఖ కవి, రచయిత ‘లతిక’ రాసిన సన్మానపత్రాన్ని వేదికమీద చదివి దాసుగారికి సమర్పించాడు బుచ్చిబాబు. చివర్లో సూరదాసుగారు లేచి నిలబడ్డారు. సభాసరస్వతికి వినమ్రంగా నమస్కరించారు. ఆ పందిట్లో అందరిచేతా ముమ్మారు ‘శ్రీమద్రమారమణ గోవిందా’ అనిపించారు. ఆనక నవ్వుతూ ఇలా మాట్లాడారు.‘‘జనంచేత గోవిందలు కొట్టించి కథ ప్రారంభించడం మా హరిదాసుల సంప్రదాయం. ఇవాళ నా సొద చెప్పేముందు కూడా ఇలా గోవిందలతో పైవాడి దగ్గర అటెండెన్స్ వేయించుకున్నానన్న మాట!’’ సూరదాసుగారి నుంచి అలాంటి చమత్కారాలు అలవాటైన జనం మరోసారి ‘గోవింద’ కొట్టారు. దాసుగారు శాలువాలు సవరించుకుని,