‘శ్రీకి మతి పోయిందా ఏంటి?ఇలా ప్రవర్తిస్తోంది!’ఆ సోమవారం పొద్దున, ఒక బడిపిల్లలా గునుస్తూవచ్చి జయంతి తన డెస్క్ దగ్గర కూర్చుందో లేదో.. ఠంగ్ మంటూ కల్యాణి వాట్సాప్ మెసేజ్.ఆ వెంటనే క్లిక్ క్లిక్ మంటూ ఫార్వర్డ్‌లు వరసపెట్టాయి. డౌన్లోడ్ చక్రం గిరగిరా తిరగసాగింది.
అవన్నీ డౌన్లోడ్ అయ్యేలోగా ఆపూట చేయాల్సిన పనులను, తెరమీద వరసలో పెట్టుకొంటూనే, ‘శ్రీ ఎక్కడుందా’ అని ఓమారు కలియ చూసింది. క్యాబిన్లో నుంచి రమాశ్రీ కనబడలేదు. ‘ఏదైనా సర్‌ప్రైజ్ ఈవెంటా? తన పుట్టినరోజు కాదే!’డౌన్లోడ్ చక్రం ఆగింది. తెరమీద ప్రత్యక్షం అవుతోన్న ఫార్వర్డ్‌లు కంటపడగానే, జయంతి బుర్ర గిర్రున తిరిగింది. అసంకల్పితంగా టేబుల్ అంచులు అదిమి పట్టుకొని, సంభాళించుకొంది. తెర మీద అన్నులమిన్న రమాశ్రీ... ఐటంగాళ్ ఫోటోల వంటివి ఉన్నాయి. ఏదో తెలియని గగుర్పాటుతో జయంతి వెన్ను జలదరించింది.‘ఎవరైనా ఆటపట్టించడానికి పెట్టిన ప్రాంక్ పోస్టా? లేకపోతే, పోకిరీ చేష్టల ఫోటోషాపీ మార్ఫింగా?’ అనుకుంటూ, కల్యాణికి మెసేజ్ చేసింది.‘‘ఏం జరుగుతోంది?’’‘‘అదే అర్థంకాక!’’ కల్యాణి తిరుగుటపా.‘‘సైబర్ బుల్లీనా? రిపోర్ట్ చేద్దామా?’’‘‘ఎవరు పోస్ట్ చేశారో చూడుముందు!’’ కల్యాణి టపా ఠపీమంటూ.
చూసీచూడగానే, అప్పటిదాకా ఏ కొద్దిగానో ఉన్న జయంతి మతి పూర్తిగాపోయింది. అవన్నీ స్వయాన రమాశ్రీనే పోస్ట్ చేసింది.‘‘ఇంపాజిబుల్! శ్రీ అకౌంట్ హ్యాక్ అయ్యుంటుంది!’’‘‘వాహ్ తాజ్?’’ సెగలు పొగలు కక్కే కాఫీకప్పు బొమ్మతో సహా కల్యాణి ప్రశ్న.జయంతి మూడుగులాబీల బొమ్మతో జవాబిచ్చింది. ‘త్రీ రోజెస్!’ అంటూ.ఇద్దరూమెల్లిగా యుటిలిటీ రూం వైపు నడిచారు, ఏ డెస్క్ ముందైనా రమాశ్రీ దర్శన మిస్తుందా అని హాలునంతా స్ర్కీన్ చేస్తూ.ఫఫఫఇన్‌స్టంట్ కాఫీని, లెమన్ టీని చెరొక కప్పులో అన్యమనస్కంగా కలుపుకొనివచ్చి ఎదురుబొదురుగా కూర్చున్నారు.
‘‘నమ్మలేకపోయా!’’ కల్యాణి గొంతులో అపనమ్మకం సుళ్ళు తిరుగుతోంది.‘‘వర్క్‌కి వచ్చిందా?’’ జయంతి రమాశ్రీని గురించి ఆరా తీసింది.తెలియదన్నట్టు పెదవి విరిచింది కల్యాణి. చేతిలోకప్పుతో చెరో సెల్ఫీతీసి, రమకి పంపారు, ఎవరికి వారే.‘‘వస్తుందంటావా?’’ జయంతి గొంతులో సందేహాల నీడలు.‘‘మామూలుగా అయితే రావాలిగా మరి!’’ కల్యాణి అభావంగా అంది.‘ఎవరి జీవితాల్లోనూ జొరబడకుండా తమతమ పరిధుల్లో ఉంటూనే, హుందాగా స్నేహించడం వీరికే చెల్లు!’ అనుకొంటారు తెలిసినవారంతా. ఊహాతీతంగా, రమాశ్రీ హఠాత్తుగా ప్రకటించిన ఈ వింతకోణం వారికి కొత్తజేసింది!