నాతో మాట్టాడ్డమే ఓ ఎడ్యుకేషన్‌ అన్నాడు గిరీశం. గొప్పగొప్ప వ్యక్తులు, కవులు మాట మాట్టాడినా, ఓ ఉత్తరం గెలికి అవతలపారేసినాగానీ అవి కాలగతిలో గొప్పవిగా చలామణీ అవుతాయి. ఈ కథలో కామేశం అంత గొప్పవాడు కాదుగానీ, అందుకోసం అర్హత ఉన్నా లేకపోయినా ప్రయత్నం అంటూ చేస్తున్నవాడే! ఓ మాంఛి కథకుడుగా స్థిరపడేందుకు పత్రికలకి పంపుతూ తెగప్రయత్నాలు చేసేస్తున్నాడు. కానీ ఇంతలో వెదకబోయిన తీగ మరోవిధంగా కాలికి చుట్టుకుంది!!

సెల్‌ రింగయ్యింది.‘‘హల్లో!’’ అన్నాడు కామేశం.‘‘కవితా సామ్రాట్‌ కామేశంగారా?’’‘‘నేను కామేశాన్నే, కానీ కవితా సామ్రాట్టు ఎవరు?’’ అన్నాడు కామేశం.చెవి దగ్గర్నుంచి సెల్‌ తీసి ఒకసారి దానివైపు ఎగాదిగాచూసి మళ్ళా చెవిదగ్గర పెట్టుకున్నాడు.‘‘తమరే మహానుభావా!’’ అన్నాడు అవతలి వ్యక్తి.‘‘తమరెవరో నాకు తెలియదు. ఇప్పుడు నేనెవరోకూడా నాకు తెలియటం లేదు. నేను ఇప్పటిదాకా ఉత్త కామేశాన్నే అనుకుంటున్నా’’ అన్నాడు కామేశం బుర్రగోక్కుంటూ.‘‘అయ్యా! నా పేరు సాహితీసుబ్బారావు. అంతా నన్ను ‘సాసు’ అంటారు. మాదో గొప్ప సాహితీసంస్థ.

మా సంస్థ పేరు...’’ చెప్పాడు అవతలి వ్యక్తి.‘‘సా.... హత్య.... శవం ‘తియ్యన’? ఇదెక్కడి సంస్థ స్వామి?’’‘‘సా....హితీ... స్రవంతి’’ స్వామీ!తమరు పదాలని మరీ అన్యాయంగా విరగ్గొట్టేస్తున్నారు!సరే, మీకో శుభవార్త. మేం నిర్వహించిన జాతీయస్థాయి కవితలపోటీలో తమరి వచనకవితకు ప్రథమబహుమతి వచ్చింది. ద్వితీయ, తృతీయ బహుమతులకు అర్హమైన కవితలు రాలేదు’’.‘‘నిజమా? నేను కవితలు కూడా రాస్తానా? దానికి బహుమతి కూడానా?’’ ఆశ్చర్యపోవటం కామేశం వంతైంది.‘‘కవితలే కాదు, మీకు తెలియకపోవచ్చు, నానీలు, హైకూలు, కథలు, నవలలు, నాటకాలు కూడా రాస్తారు మీరు. అందుచేత...’’‘‘నాగురించి నాకే తెలియని నా విషయాలు మీకెంత బాగా తెలుసు!’’ అన్నాడు కామేశం మెచ్చుకోలుగా.

‘‘అందుచేత...రేపు వచ్చేనెల ఒకటవ తారీఖు సాయంత్రం మీకు బహుమతి ప్రదానోత్సవం, సన్మానం’’.‘‘ఎక్కడండీ?’’‘‘మీరు ఎక్కడంటే అక్కడే’’‘‘అదేమిటీ! సన్మానం చేసేది మీరుగదా?’’‘‘అవుననుకోండి. చేయించుకునేది మీరేగా? త్యాగరాజుగానసభ, రవీంద్రభారతి, జింఖానా గ్రౌండ్స్‌, యల్‌.బి.స్టేడియం...ఏదోఒకటి అనుకుంటున్నాం. మీ సహకారాన్నిబట్టి నిర్ణయిస్తాం’’.‘‘సహకారానిదేముంది? రావడమేగా? తప్పకుండావస్తాం’’ అన్నాడు కామేశం. కానీ, ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా కామేశానికి తను కవితలు రాసినట్టు గుర్తుకురావడం లేదు.