వాళ్ళిద్దరూ బాధ్యతగల ఉద్యోగులే. కానీ ఏళ్ళ తరబడి ఆ ఇల్లాలు ఇంటికి దగ్గర్లో ఉన్న ఆఫీసులోనే ఏదో ఉద్యోగం చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా ఉండిపోయింది. ఆమె దృష్టి అంతా ఇంటిమీదే. ఆ సంసార జంఝాటంలో పడి ఆమె ఉద్యోగ ప్రతిభాపాటవాలన్నీ కొడిగట్టాయి. ఇంట్లో ఆమె చూపించే ప్రతిభవల్ల అందరూ స్వతంత్రంగా పనులు చేసుకోవడం మరచిపోయారు. అన్నిటికీ ఆమెమీదే ఆధారపడ్డారు! అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే........
***************************
ఆ రోజు ఆఫీసులోకి అడుగుపెడుతుంటే, ప్రవేశద్వారం దగ్గర ఉన్న నోటీస్ బోర్డ్‌లో విజయనిర్మల చాక్‌పీస్‌తో హిందీ పదం వ్రాస్తూ కనపడింది. విజయనిర్మల మా ఆఫీసులో హిందీ కార్యాచరణ విభాగంలో పనిచేస్తుంది. ఉద్యోగులందరికీ హిందీనేర్పే పనిలో భాగంగా రోజు ఒక హిందీ పదం బోర్డుమీద వ్రాసి కింద తెలుగు, ఇంగ్లీష్‌లలో దాని అర్థం వ్రాస్తూ ఉంటుంది.ఇవాళ్టి పదం ‘స్థానాంతరణ్’ అని వ్రాసి కింద ట్రాన్స్ఫర్, బదిలీ అని వ్రాసింది. ‘‘ఎవరికి తల్లీ స్థానాంతరణ్?’’ నవ్వుతూ అడిగాను. ‘‘ఎవరికేమిటి జ్యోత్స్నా? నీకూ నాకూ మన అందరికీ! నిన్న రాత్రే వచ్చిందట నోటిఫికేషన్. వెళ్ళిచూడు’’ అని చెప్పింది. ‘‘అవునా!’’ అంటూ హడావిడిగా లోపలికి నడిచాను.‘చాలా ఏళ్ళుగా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నవారిని బలవంతపు బదిలీలపై వేరేచోట్లకు తరలించే ప్రతిపాదన మా ఆఫీసులో ఎప్పటినుండో వినపడుతున్నా అది ఇన్నాళ్టికి వాస్తవరూపం దాల్చినట్టుంది.
ఆవేళ అందరం పనులు మానేసి అదేచర్చలో మునిగిపోయాము. అక్కడ అందరం దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలకు తక్కువ కాకుండా పనిచేస్తున్న వాళ్ళమే. ఆ చుట్టుపక్కలే ఇళ్ళూ అవీ కొనుక్కుని పిల్లాజెల్లల్ని, దగ్గర స్కూళ్ళల్లో కాలేజీల్లో వేసుకుని మొత్తానికి ఎన్నోఏళ్ళుగా ఆ ఊరికీ, ఆ ఏరియాకి, ఆ ఆఫీసుకి అలవాటుపడ్డ మాకు అదొక పెనుమార్పే. ఒక్కసారి సిటీ నుండి కదిలితే మళ్ళీ తిరిగి ఇక్కడికి బదిలీమీద రావడం కష్టం కాబట్టి ప్రమోషన్లు సైతం వదులుకొని ఇక్కడే ఉండిపోయాము. మగవాళ్ళకి కొంతలోకొంత నయం. వాళ్ళ కుటుంబాలని ఇక్కడే ఉంచేసి వాళ్ళే రోజూ వెళ్ళిరావటం, లేదా దూరమైతే వారంవారం రావటం చెయ్యొచ్చు. కాని మాలాంటి ఆడవాళ్ళకు ఇంటికి దూరంగా వెళ్ళటం అంటే మరీ కష్టం. అసలు మేము లేకుండా ఇల్లు నడవటమే కష్టం. అలాంటిది ఇప్పుడు ఈ ఉపద్రవం ఏమిటో!’