ఎదుటివాళ్ళను అర్థం చేసుకోరు కొందరు. ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవాలనే ఇంగితజ్ఞానం కూడా ఉండదు. దొరికాడుకదా అని సొంతడబ్బా వాయించుకుని ఫోన్ పెట్టేస్తారు. సమాజంలో పెద్దతరహాగా ఉంటారుకాబట్టి, వాళ్ళ మాట చెలామణీలో ఉంటుంది. వాళ్ళసాయం మనకి కావాలిగనుక ఇలాంటివాళ్ళని లౌక్యంగా భరించకతప్పదనుకుంటా! ఈ కథలో ఒకాయనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది!
ఫోన్ అదేపనిగా మోగుతోంది.‘‘హల్లో! ఎవరండీ....’’‘‘మీరు సుబ్బారావు గారేనా?’’‘‘అవునండీ!’’‘‘నమస్కారం సార్! నేను శ్రీహరిని. మీతో ఐదు నిముషాలు మాట్లాడటానికి వీలవుతుందా?’’అతని మాటల్లోని మన్నన మర్యాద సుబ్బారావుకి నచ్చాయి.‘‘శ్రీహరి అంటే! మా ఆనందరావుగారి తమ్ముడా మీరు?’’‘‘అవునండీ! రాజమండ్రినుంచి నిన్న సాయంత్రం వచ్చానిక్కడికి. మీతో ఒక విషయం గురించి...’’ శ్రీహరి మాటలు పూర్తికాలేదు.సుబ్బారావు నోరు విప్పాడు.‘‘ఆహా! అలాగ్గా? మీరు ఇక్కడికి వచ్చే సమయంకి మా అబ్బాయి కోడలు, కూతురు అల్లుడు, పిల్లలు ఆగ్రా నుంచి వచ్చారండీ!’’‘‘మంచిదండీ! చాలా సంతోషం!’’మరోసారి తన విషయం చెప్పబోయాడు శ్రీహరి. ‘‘మీకు తెలియదుకదూ? మా వాళ్ళంతా ప్రతిసంవత్సరం అలాఅలా సరదాగా అన్నిచోట్లకి వెళ్తుంటారండీ! ఆగ్రా వెళ్ళి తాజమహల్ చూశారట. వాళ్ళ ఆనందం ఏమని చెప్పను? మీ ఫోన్ రాక ముందు ఆ విశేషాలే చెబుతూ తెగ సంబరపడిపోతున్నారు’’సభ్యతకోసం మధ్యలో మాట కలిపాడు శ్రీహరి.
‘‘మీరు కూడా వాళ్లతో వెళ్ళి ఉండాల్సింది’’‘‘అబ్బే! మనకెందుకులెండి. పిల్లలతో మనం కలవలేం కదా? వాళ్ళ ఆనందంవాళ్ళది. వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. నన్నూ రమ్మన్నారు. ఆ ఓపిక నాకు లేక వెళ్ళలేదు. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం సంతోషించాలిగానీ, వాళ్ళతోబాటు ప్రతిదానికీ కూడా వెళ్ళడం సరికాదనుకుంటాను, ఏవంటారు...?’’‘‘అనేదేముందండీ? చాలా మంచిమాట చెప్పారు. మా అమ్మాయి పెళ్ళిసంబంధం విషయంలో మీ సలహా...’’శ్రీహరి చెప్పేది వినకుండా ‘‘పెళ్ళి సంబంధం అంటే గుర్తొచ్చింది. మన గుర్నాధంగారి అమ్మాయి అబ్బాయిల పెళ్ళిళ్ళు నేను పూనుకోకుంటే అయ్యేవా? అస్సలు వాళ్ళకి ఆ విశ్వాసం కృతజ్ఞత పెద్దవాళ్ళన్న గౌరవం లేకుండా పోయింది’’‘‘వాళ్ళ పెళ్ళిళ్ళై ఐదేళ్ళు దాటాయికదండీ? అప్పుడు వాళ్ళు మీకు బాగానే మర్యాదచేసి గౌరవించారు కదూ? మీ దంపతులకు పట్టుబట్టలు పెట్టి సత్కరించారు కదా?’’