రాత్రి భోజనాలు అయ్యాయి. చల్లగా వెన్నెల కురుస్తోంది. సత్రం వాకిలిలో కూర్చుని బాటసారులు అంతా కబుర్లలో పడ్డారు. రకరకాల రాజ్యాల గురించీ, దేశాల గురించీ మాట్లాడుకున్నారు. ఎవరు ఏ పని మీద ఎటు వెళ్తున్నదీ చెప్పుకున్నారు. తోడుగా వచ్చేవారిని పరిచయం చేసుకున్నారు. మర్నాడు ప్రయాణానికి సిద్ధమయ్యారంతా. వంటిల్లు అంతా చక్కబెట్టి అప్పుడు వచ్చింది పేదరాసిపెద్దమ్మ. ఆమెకు అరవై ఏళ్ళుంటాయి. జుత్తు బాగా నెరసి పోయి ఉంది. భర్త లేడు, పోయి పుష్కరం పైనే అయింది. దాంతో పొట్టకూటి కోసం పూటకూళ్ళ ఇల్లు నడుపుకుంటోంది. వ్యాపారం బాగానే సాగుతోంది.వరహాకి రెండు పూటలా మంచి భోజనం పెడుతుంది. భోజనం అనంతరం కాయో పండో ఇస్తుంది. కమ్మని కథలు చెబుతుంది. చాలంటారు బాటసారులు.‘‘ఏదయినా కథ చెప్పు పెద్దమ్మా?’’ వచ్చి వాకిలిలో కూర్చున్న పెద్దమ్మను అడిగారు బాటసారులు.‘‘నువ్వు కథ చెబితే వీణ మీటినట్టుగా ఉంటుంది. మురళి మోగినట్టుగా ఉంటుంది. నిద్ర వస్తుంది.’’ అన్నారు.
‘‘సర్లెండి’’ అని నవ్వుకుంది పెద్దమ్మ. చెప్పసాగిందిలా.పూర్వం కోసల రాజ్యాన్ని ఆర్యకుడు అనే రాజు పాలించేవాడు. అతనికి సూర్యకళ, చంద్రకళ, శశికళ అని ముగ్గురు భార్యలు. ముగ్గురూ మంచి అందగత్తెలు. అతి సుకుమారులు. అందంగా అంత ఎత్తున ఉన్నా, ఏడు మల్లెలెత్తు కూడా తూగరంటారు ప్రజలు. ఒకరోజు ఆర్యకుడు, శశికళసహా ఉద్యానవనంలో విహరిస్తూ, కొలనుగట్టున కూర్చున్నాడు. తామరపువ్వులతో కొలను నిండుగా ఉంది. కంటికి ఇంపుగా ఉంది. చేయి జాచి సరదాగా ఓ తామరపువ్వును తెంచాడతను. ఆ పువ్వుతో చిలిపిగా శశికళ తల మీద సుతారంగా కొట్టాడు. ఆ దెబ్బకు శశికళ బాధగా అరిచి తల పట్టుకుని కింద పడిపోయింది. పరివారం చుట్టుముట్టిందామెను. చూస్తూండగానే శశికళ తల బొప్పికట్టి, పెద్ద ఎత్తున వాచిపోయింది. స్పృహ కోల్పోయిందామె.‘‘ఏం జరిగింది మహారాజా?’’ ఆర్యకుణ్ణి అడిగింది చెలికత్తె. జరిగింది చెప్పాడతను.‘‘ఎంత పని చేశారు మహారాజా! శశికళ అతికోమలం. మహాసున్నితం. మీరు అది గమనించలేకపోయారు.’’ అన్నది చెలికత్తె.రథంలో శశికళను తరలించారు. అంతః పురానికి చేర్చారు. రాజవైద్యులు వచ్చారు. చికిత్స ప్రారంభించారు. రకరకాల మైపూతలనూ, మలాములనూ, తైలాలను తీసుకొచ్చి, వాటిని శశికళకు రాసి, స్వస్థత చేకూర్చారు. ప్రమాదం తప్పింది. ఊపిరి పీల్చుకున్నాడు ఆర్యకుడు.