దేవుడి దర్శనం చేసుకోవడం, దేవుడి సేవలో పునీతం కావడమే పుణ్యం సంపాదించుకోవడం అనుకుంటారు చాలామంది. మానవసేవే మాధవసేవ అనుకుంటారు మరికొంతమంది. అనాథలను చేరదీసి ఉపాథికల్పించడమే పుణ్యకార్యం అనుకుంటారు ఇంకొంతమంది. కానీ ఈ కథలో హోటల్‌ యజమాని స్వామి మాత్రం అంతకుమించిన పనిని స్వామికార్యంగా, తల్లిదండ్రులసేవగా భావించాడు. ఏమిటది?

‘వాళ్ళిద్దరూ ఒక్కరోజులోనే ఎవరికీ చెప్పకుండా పారిపోవడం ఊహించలేకపోతున్నాను. ఎంత దగా చేశారు! వాళ్ళు చేసింది నమ్మకద్రోహమే. ఇదంతా నిజమేనా!’ ఆలోచించేకొద్దీ నాకు మతిపోతుంది. అసలు ఆ బడుద్ధాయిలిద్దరినీ నాలుగేళ్ళక్రితం నేనే ఈ స్వామిహోటల్లో చేర్పించాను.ఆ రోజు నాకు ఇంకా గుర్తే! పెదవాల్తేరులో కరకచెట్టు పోలమాంబ పరస జరుగుతోంది. ఆ గుడికి దగ్గరలో ఉన్న మా హోటల్లో రద్దీ ఎక్కువగానే ఉంది. క్యాషియర్‌గా నేను ఉక్కిరిబిక్కిరవుతున్నాను. మామూ లుగాకంటే మూడురెట్లు ఎక్కువగా వచ్చింది కలెక్షన్‌. శాకాహారం, మాంసాహారం విడివిడిగా ఉండడం వలన ఏ వినియోగదారుడూ మా హోటల్‌దాటి మరోచోటకుపోడు. ఆహార పదార్థాలు రుచిగా, శుచిగా ఉంటాయనీ, మా హోటల్‌ శుభ్రతకు మారుపేరనీ మౌఖిక ప్రచారం ఉండనే ఉంది.

కస్టమర్లరద్దీ తగ్గిన తరువాత కాస్త ఫ్యానుగాలినుంచి ఉపశమనం కోసం బయటకొచ్చి నిలబడ్డాను. అప్పుడు కనిపించారు వాళ్ళిద్దరు.వాళ్ళిద్దరి వయస్సు ఇంచుమించు పదహారుసంవత్సరాలు ఉంటుంది. తిండిలేక నీరసం, నిస్సృహతో వయస్సు మీదపడినట్టు ఉన్నారువాళ్ళు. వాళ్లిద్దరికీ అప్పటికప్పుడు శక్తిరావడానికి చెరో గ్లాసు ఉప్పు, పంచదార కలిపిన మజ్జిగ ఇప్పించాను.‘‘ఎవరు మీరు? ఎక్కడ నుంచి వచ్చారు?’’ అని అడిగాను.వాళ్ళలో ఒకడిపేరు రాకేశ్‌. మరొకడిపేరు సంతోశ్‌. వాళ్ళిద్దరిదీ ఒకటే కథ. పదోతరగతితప్పి ఒకడు, చేసిన చిన్నదొంగతనానికి భయపడి మరొకడు పారిపోయివచ్చినవాళ్ళే.

అయితే వాళ్ళిద్దరూ అనాథలే. దారీతెన్నూ లేని నిర్భాగ్యులు. నాకు వాళ్ళను పనిలో పెట్టుకుందామని ఉంది. కానీ మా హోటల్లో వాళ్ళు క్లీనర్లుగాతప్ప మరేవిధంగానూ పనికిరారు. మా సూపర్‌వైజర్‌ ఒప్పుకుంటాడా? మా యజమాని కుమారస్వామి ఏమంటారో?కుమారస్వామిగారివద్ద నా మాటకు మర్యాద దక్కింది. రాకేశ్‌ క్లీనరుగా, సంతోష్‌ పార్శిల్‌ బాయ్‌గా కుదిరారు. వాళ్ళు తమసేవలతో ఏటికేడాది ఎదుగుతూ, వెయిటర్లుగామారి కిచెన్‌లో సహాయకుల స్థాయికి చేరుకున్నారు.