‘‘రామూ బాబుని స్కూలు దగ్గర దింపి తొందరగా వచ్చెయ్‌. ఈరోజు రోటరీక్లబ్‌లో పనులున్నాయి. పదిగంటలకల్లా అక్కడుండాలి’’ డ్రైవర్‌ రామూకి పురమాయించింది మాలినీదేవి.‘‘అలాగే మేడమ్‌’’ వినయంగా తలూపి ‘‘రండి బాబూ, స్కూలుకి టైమైంది‌’’ అంటూ రాజా బాబుని తొందరచేశాడు రాము.

‘‘ఊ, పోయింది. షూవేసుకుని వచ్చేస్తాను. ఆయమ్మ నా బాగ్‌లో వాటర్‌ బాటిల్‌ పెట్టిందో లేదో అడుగు’’ అని చెప్పి, ‘‘బై మమ్మి’’ అంటూ బయటకు నడిచాడు.‘‘లంచ్‌ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌ ఆయమ్మ సర్దిందట రాజాబాబూ రండి’’ కారు డోర్‌ తీసి పట్టుకున్నాడు రాము.రాజాబాబుని స్కూలు దగ్గర దింపి ‘‘జాగ్రత్తబాబూ’’ అని ఎప్పటిలానే చెప్పి కారు రివర్స్‌ చేసుకుని వెళ్ళిపోయాడు రాము. స్కూలు లోపలకు వెళ్తుంటే రాజా ఫ్రెండ్స్‌ ఎదురయ్యారు. ‘‘ఒరేయ్‌ రాజా ఈరోజు మన స్కూలుకి ‘హాలిడే’ ఎనౌన్స్‌ చేశారు తెల్సా?’’‘‘ఔనా. నాకు తెలియదే. ఎందుకు?’’ ఉత్సాహంగా అడిగాడు రాజా.‘‘అదేరా. నిన్న,మొన్నటి వర్షాలకి మన చుట్టుపక్కల లోతట్టుప్రాంతాల గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయట. అక్కడి వాళ్లల్లో కొంతమందిని తీసుకొచ్చి మనస్కూల్లో పెట్టారట. అదిగో చూడు’’, వేలుపెట్టి చూపించాడు రవి.

అప్పుడు చూశాడు రాజా. చుట్టూ చెట్లకింద కొంతమంది, స్కూల్‌ వరండాలో కొంతమంది గుంపులు గుంపులుగా కూర్చుని ఉన్నారు.‘‘అయ్యో పాపం. వీళ్లందరికీ ఫుడ్‌ ఎట్లా మరి?’’ స్వతహాగా జాలిగుండె ఉన్న రాజా సానుభూతిగా అన్నాడు.‘‘గవర్నమెంట్‌ ఏదో ఏర్పాట్లు చేస్తుందనుకుంటా’’ రవి సమాధానమిచ్చాడు.‘‘పాపం కదరా. అసలే బోల్డంత చలిగా ఉంది. ఆ చిన్నపిల్లలు చూడు. ఎట్లా ఏడుస్తున్నారో. వీళ్లందరినీ ఏ రాత్రో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంటారు. వాళ్ళకి చలి లేకుండా ఏదైనా ఏర్పాట్లు చెయ్యవచ్చు కదా?’’ జాలిగా అన్నాడు రాజా.