ఒక్కపాపకార్యం కూడా చెయ్యనప్పుడే రంభాఊర్వశిలుండే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని బామ్మచెబితే తు.చ తప్పకుండా పాటించాడామనవడు. పట్టుచీరలు బిచ్చకత్తెకు దానంచేసి అమ్మతో దెబ్బలుతిన్నాడు. పుస్తకాలు, ఒంటిమీద దుస్తులుసహా అన్నీ ఒలిచిచ్చేవాడు. యవ్వనంలో వయసు పోరును ఉగ్గబట్టుకున్నాడు. మంచివాడనిపించుకోడానికి నానాతిప్పలూపడి స్వర్గానికెళ్ళాడు. రంభ కూడా దొరికింది. కానీ....
‘‘ఒరేయ్ సోముడూ! .స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలుసా? స్వర్గాన్ని తలదన్నేలా ఉంటుంది’’ తల ఆకాశానికెత్తి, కళ్ళు ఆర్తిగా మార్చి, ఏదో తెలియని తన్మయావస్థను వ్యక్తం చేసింది బామ్మ. ఆ స్వర్గాన్ని మబ్బుల్లోనే ఊహించేసుకుని బామ్మ చెప్పే మాటలను, ఊహ తెలిసిన నా ఎనిమిదో ఏటనుండీ వింటూనే ఉన్నాను. అప్పుడే గరుడవాహనమేదో గగనం నుండి తేలుతూ వచ్చి, బామ్మను అమాంతంగా స్వర్గానికి ఎత్తుకుపోతుందన్నంత ఆశగా, ఆవిడ అలా గాల్లోకి భక్తిగా చూసినపుడల్ల్లా నేనూ తలెత్తి ఆమె చూసినవైపే చూసేవాణ్ణి. ఆమె మాత్రమే చూడగలిగే, మిగిలిన మానవమాత్రులెవరు చూడలేకపోయే ఆ స్వర్గాన్ని, సదరు పుష్పక విమానాన్ని వెర్రిగా వెతికేవాడిని.
ఆ ముసలిదానికి స్వర్గంపట్ల అదేం పిచ్చో తెలియదు గాని, ఆ మాటలు వినీ వినీ అసలు స్వర్గమంటే ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూసి రావాలనే కుతూహలం కలిగింది నాకు.ఈ రాకపోకలమీద సరైన క్లారిటీ రాకుండానే, ‘‘ఒరేయ్ సోముడూ! స్వర్గానికి వెళ్ళడమంటే మాటలు కాదురా. ఎంతో పుణ్యం చేసుకోవాలి. పాపకార్యాలు అస్సలు చేయకూడదు. అన్నీ పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. అప్పుడే మనకోసం స్వర్గద్వారాలు తెరచుకుంటాయి’’ అంటూ ఓ కొత్తవిషయం చెప్పింది మా బామ్మ. ‘‘ముందు స్వర్గమంటే ఏమిటో చెప్పవే బామ్మా, పాపపుణ్యాలగురించి ఆ తరువాత చెపుదువు గాని’’ అన్నాను. నా పదేళ్ళ వయసులో అనుకుంటా స్వర్గం అంటే ఏమిటో చెప్పమని మా బామ్మదగ్గర తిష్ట వేసుక్కూర్చున్నాను.
అప్పుడు చెప్పిందిలా బామ్మ. ‘‘పుణ్యాత్ములు మాత్రమే ఉండే పవిత్రమైన చోటు స్వర్గం. మనం మరణించిన తరువాత మన ఆత్మను యమభటులు యమపురికి తీసుకెళతారు. అక్కడంతా రాక్షసులూ, యమభటులూ ఉంటారు. అక్కడ మన పాపపుణ్యాలను లెక్కలు వేస్తారు. పాపాలు ఎక్కువ చేసినవారిని నరకానికీ, పుణ్యకార్యాలు చేసినవారిని స్వర్గానికీ పంపిస్తారు. నరకంలో శిక్షలూ, ఏడ్పులు పెడబొబ్బలూ ఉంటే, స్వర్గంలో ఇంద్రుడు, దేవతలు, మహా ఋషులు, గంధర్వులు, నర్తకీమణులు ఉంటారు. ఇప్పుడు మనం పూజలుచేసే దేవుళ్ళందరూ ఆ స్వర్గానికి చుట్టుపక్కల ఉన్న వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకాలలో నివసిస్తూ ఉంటారు. అందరినీ కళ్ళారా చూడొచ్చు. ఒక్కసారి అక్కడికి వెళితే ఈ కష్టాలూ, దు:ఖం ఇవేవీ ఉండవు. అక్కడంతా ఆనందమే ఆనందం’’.