అనివార్యమైన పరిస్థితుల్లో అర్థరాత్రి వడివడిగా తన గమ్యానికి వెళుతున్నాడతను. సంఘంలో గౌరవప్రదమైన మనిషే. దార్లో ఎవరైనా కనిపిస్తే, సందేహిస్తూ, తన ధర్మం తను పాటిస్తూ, ఆచి చూచి కాలుముందుకేస్తున్నాడతను. అయినాసరే, అనుకున్నంతా అయింది. నాగరిక సమాజం అంటేనే తెలియని కొన్ని జీవులకైనా క్షీర నీర న్మాయం తెలుసేమోగానీ, ఆ రాత్రివేళ అన్నీ తెలుసనే ఆ అధికారికి మాత్రం ఆ కనీస ఇంగితం కూడా అబ్బినట్టులేదు!! దాంతో ఏమైందంటే..

నీలోఫర్‌, పైలాన్, ఐలా, హుద్‌హుద్‌, నాలా...తుఫానులకు నామకరణం చేయడంలో సైంటిస్టులు గొప్ప నేర్పరులు. వాటికి తగ్గట్టు వాతావరణకేంద్రం విడుదలచేసే సూచనలను ఆకాశవాణిసహా ఈటీవీ..ఆటీవీ..నీ టీవీ..మీ టీవీ...అదేదో టీవి అన్ని టీవీ చానల్స్‌వారు ప్రజలకు చేరవేసే దూరదృష్టితో వారివారి శైలీవిశేషాల్ని కనబరుస్తున్నారు. ఎప్పటెప్పటివో తుఫానుల భయానక దృశ్యాలు చూపిస్తూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.

తుఫాను గాలుల వేగానికి పాకలు, రేకులు పైకప్పులు ఎగిరిపోవచ్చు, చెట్లు విరిగి పడతాయి కరెంటు స్తంభాలు పడవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వాన్నికి సహకరించండి అన్నివిధాల ఆదుకుంటామని ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా, కలెక్టర్లు రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులు ఎం.ఎల్‌.ఏలు.. ఎం.పీలు వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తుచర్యలు, ప్రమాదం తదుపరిచర్యలు తీసుకున్నారు. సహాయనిధులకోసం ఆరా తీస్తున్నారు. నింపాదే–సంపాదన అనే నినాదాన్ని మ్మిన ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు–పరుగులు అంటే ఉసూరుమంటున్నారు.

నిజమే వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే భవంతులలోని వారికేమోగానీ పూరిళ్ళలోని పేదోళ్ళకు మిగిలేవి మట్టిపెళ్ళలే. ఇంటి పైకప్పులు ఎగిరిపోతే తమకేమి, చెట్లు తలకిందులైతే తమకేమి...తన ధ్యేయమల్లా కళావాది, కళాకారులకు మార్గదర్శకుడు డా. గోపాలస్వామి ఆరుబయలు రంగస్థలిలో ముందుగా ప్రకటించిన తేదీన ఆటంకం లేకుండా నాటకం ప్రదర్శించడం, ప్రేక్షకుల చప్పట్లతో తన్మయత్వం పొందడమూను. ఆనాటి నాటకంలో నటీనటుల్లో రామలింగం ఓ ప్రత్యేకనటుడు.‘‘ఏమండీ ఇంత భీభత్సవాతావరణంలో నాటకం చూడడానికి ఎవరు వస్తారండి. నాటకం మరో రోజు ప్రదర్శించవచ్చు కదా! రాత్రి పన్నెండు గంటలు దాటితే కరెంటు ఉండదంటున్నారు, ఆర్‌.టి.సి. బస్సులు ఎలాను ఉండవు. ఆటోలు తిరగకపోవచ్చు...’’ బయలుదేరేటప్పుడు ఇల్లాలు బెస్టాఫ్‌లక్‌ చెప్పినట్లు హెచ్చరికలు చేసింది.