విశ్వా!నా మనవరాలు ప్రత్యూష ఇవాళ ఫోన్‌ చేసి ‘‘నానమ్మా! నేను పాసయ్యాను. ఆరువందలకు ఐదొందల ఎనభై మార్కులు వచ్చాయి. డాడీ ఓకే కానీ మమ్మీనే ఇరవై మార్కులు తగ్గాయని తెగ బాధపడిపోతూ ఉంది. నానమ్మా! నీకు ఇష్టమైన ఇంకో విషయం చెప్పనా? నాకు తెలుగులో వందకు వంద మార్కులు’’ ఆనందంగా చెప్తుంటే తనకు అభినందనలు చెప్పానే గానీ నా మనసు ఎక్కడికో వెళ్ళి పోయింది.ఎక్కడికో నీకు తెలుసు!అవును.. టెన్త్‌ క్లాస్‌ రిజల్ట్స్‌ వచ్చిన ప్రతి యేడు మన పరిచయానికి మరో యేడు కలుపుతుంది. పరిచయం అంటే మనుషులకు కాదు .. మనసుకు! అవును... నువ్వు ఆ రోజే నా మనసుకు కొత్తగా పరిచయం అయ్యావు.అప్పట్లో ఇంటర్నెట్లు, సెల్‌ఫోన్లు లేవు కదా! చాలా విషయాలకు మనం రేడియో, దినపత్రికల వార్తలపై ఆధారపడ్డ కాలమది.

 

దినపత్రిక మీ ఇంటికి, సర్పంచ్‌ వాళ్ళింటికి మాత్రమే వచ్చేది. నేను, మీ చెల్లెలు సరోజ క్లాస్మేట్స్‌ - ఫ్రెండ్స్‌మి కూడా! అలాగే .. నువ్వు, మా అన్న శేషు .. ఫ్రెండ్స్‌. మీరిద్దరూ ఇంటర్‌ .. మేము టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు రాశాం. ముందు మీ రిజల్ట్సే వచ్చాయి. నువ్వు, మా అన్నా.. ఇద్దరూ పరీక్ష తప్పారు.మా నాయన అన్నని బాగా కోప్పడ్డాడు. ఇంక చదివించనని, వ్యవసాయం చేయాల్సిందేనని ఖచ్చితంగా చెప్పేశాడు.ఆ తర్వాత మావి కూడా వచ్చాయని తెలిసి, మీ ఇంట్లో పేపర్లో రిజల్ట్స్‌ చూసుకొని వస్తానని నా హాల్‌ టికెట్‌ తీసుకుని పోయిన మా అన్న కోసం నేను అరుగుమీద ఆత్రంగా, అసహనంగా, ఒకింత భయంగా కూర్చొని ఉన్నాను. అన్న కోసం ఎదురు చూస్తుంటే నువ్వొచ్చావు. నువ్వయినా ఇంట్లోకి రాలేదు. వీధి గేటు దగ్గరే నిలబడి ‘‘ఓయ్‌! నువ్వు సెకండ్‌ క్లాస్లో పాస్‌ అయ్యావు’’ అనేసి ముందుకు కదిలావు.‘‘అవునా!?!’’ అపనమ్మకంతో కూడిన సంభ్రమంతో నా మొహం చందమామను చూసి వికసించిన కలువలా విప్పారిపోయింది. అసలే బాదం కాయల్లా పెద్దవైన నా కళ్ళు మరింత విచ్చుకున్నాయి.

                                             *************************************