ఒకానొక గ్రామంలో సూరదాసు అనే యువకుడు ఉండేవాడు. అతడు తెలివైనవాడే కానీ, బ్రతక నేర్చినవాడుకాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా అడిగిన వాళ్లందరికీ పనులు చేసిపెట్టేవాడు. అడగందే అమ్మ అయినా పెట్టదుకదా, ఒక్కరుకూడా అతడి అవసరాలేమిటో తెలుసుకుని ఏమీ ఇచ్చేవారుకాదు. ఇది సూరదాసు తలిదండ్రులకు బాధగా ఉండేది. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం సూరదాసుకు కష్టం తెలియకుండా పెంచినవాళ్లు ఇప్పుడు వృద్ధాప్యభారంతో ఎక్కువ కష్టపడలేకపోతున్నారు. కొడుకు ప్రయోజకుడై డబ్బు సంపాదిస్తే, అతడి చేతుల్లో సుఖపడాలనుకుంటున్నారు. కానీ, అదెప్పుడో తెలియడంలేదు.

సూరదాసు ఒకదార్లో పెట్టడం తమవల్లకాదని గ్రహించిన తల్లిదండ్రులు వాడికి పెళ్ళి చేయాలని అనుకున్నారు. కానీ ఏ ఆధారమూ లేనివాడికి పిల్లని ఎవరిస్తారు? అందువల్ల, పాతికేళ్లొచ్చినా సూరదాసుకు పెళ్ళి కాలేదు.ఒకరోజు సూరదాసు తల్లికి పెద్ద జబ్బుచేసింది. తండ్రికి కదిలే శక్తిలేక, ‘‘నాయనా! వెంటనే వెళ్లి వైద్యుణ్ణి పిల్చుకురా’’ అన్నాడు కొడుకుతో. సూరదాసు వైద్యుణ్ణి పిల్చుకుని వచ్చాడు. వైద్యుడు సూరదాసు తల్లిని పరీక్షించి, ‘‘ఇది సామాన్యులకు రావలసిన జబ్బు కాదు. నయం చేయాలంటే బాగా ఖర్చవుతుంది. ముందుగా యాభై వరహాలు తెచ్చిస్తే వైద్యం ప్రారంభిస్తాను’’ అని వెళ్లిపోయాడు.

ఇంట్లో ఒక్క వరహాకూడా లేదని తండ్రి సూరదాసుకి చెప్పాడు. సూరదాసు తనకు తెలిసిన వారందర్నీ సహాయం అడగడానికి వెళ్లాడు. కానీ ఒక్కరుకూడా అతడికి సాయపడలేదు. ఎందుకంటే అంతవరకూ అందరూ అతడివల్ల అంతోఇంతో ఉపకారం పొంది వున్నారు. అందుకు అతడెన్నడూ ప్రతిఫలం అడగలేదు. ఇప్పుడు డబ్బిస్తే, ఊరికే ఇవ్వాలితప్ప అప్పుగా ఇచ్చి, తిరిగి తీర్చమనలేరు కదా! మొదలే, లేదని నాలుగు సానుభూతి కబుర్లు చెబితే సరిపోతుంది కదా అనుకున్నారంతా!