‘‘సంక్రాంతి పండక్కి నువ్వు కూడా నాతో పాటే మా ఊరు రావాల్రోయ్‌. క్రితం సారి వత్తానని చెప్పి హేండిచ్చావ్‌.. ఈసారి మాట తప్పావంటే, ఇంక ఈ జన్మలో నీతో మాట్లాడేదే ఉండదు జాగర్త’’ ముందే హెచ్చరించాడు అన్నవరం.‘‘నువ్వు ఒక్క తీర్గ జెప్తుంటే రాకుంట ఉంటనార. తప్పకుంట మీ ఊరొస్త’’ మాటిచ్చాడు మిత్రుడు యాద్గిరి.యాద్గిరి, అన్నవరం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో క్లాస్‌మేట్స్‌. ఎటువంటి ‘ఎడ్డిర్కం’ లేకుంట ఎదుటివారిని పలకరించే గుణం యాద్గిరిదైతే, మంచోడైతే చాలు ఇట్టె కలుపుకుపోవడం అన్నవరం తత్త్వం. అందుకేనేమో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.అనుకున్నట్టుగానే... పండక్కి రెండ్రోజుల ముందే గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. ఒకటే రద్దీ. అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేదు.

 జనాల గోలకి నిద్రపట్టక, తెట్టన తెల్లారేటప్పటికల్లా లేచి కూర్చున్నాడు యాద్గిరి. కిటికీలోంచి పచ్చని చెట్లు, వరిపొలాలు, చెరువులు... చూస్తుంటే పొద్దు పొద్దున్నే కడుపు నిండినట్టే అయ్యింది. ఇక రాజమండ్రి బ్రిడ్జి మీది నుంచి గోదావరిని చూసేసరికి మహదానందం కలిగింది. ‘‘ఏందో అనుకున్నా గానీ మీ దిక్కు భలేగుందిరా’’ అన్నాడు, అప్పుడే లేచి కళ్ళు నులుముకుంటున్న అన్నవరంతో. అప్పటికే రైలు బిడ్జి దాటిపోటం చూసి, కంగారు కంగారుగా నిద్దర కళ్ళతోనే గోదారమ్మకి దండంపెట్టుకున్నాడు. ‘‘పద, పద లగేజీ తీసుకో రాజమండ్రి వచ్చేసేం. మనం దిగాల్సింది ఇక్కడే’’ అని తొందరపెట్టాడు. ఇద్దరూ బస్టాండుకెళ్లి, ఆత్రేయపురం బస్సెక్కారు. బండి కదిలింది.

‘‘ఇదిగో ఇదే ధవలేస్రం బ్యారేజీ. ఎప్పుడో 1852లో కాటన్‌ దొర ఇక్కడ ఆనకట్ట కట్టబట్టే మా బతుకులు బాగుపడ్డాయ్‌, అందుకే ఊరికో ఇగ్రహం పెట్టి మరీ ఆయన్ని గ్యాపకం ఎట్టుకుంటాం మేం, అలా తిన్నగా పొతే పూలవనం కడియం వత్తాది. రేపో, ఎల్లుండో తీస్కెళ్ళి సూపిత్తాలే’’... అన్నవరం పరవశంగా చెబుతున్నాడు యాద్గిరికి. అంతలోనే ఆత్రేయపురం వచ్చేసింది. అన్నవరం ఇల్లు చూస్తేనే మతిపోయింది యాద్గిరికి. చుట్టూ కొబ్బరిచెట్లు. మఽధ్యలో పెంకుటిల్లు. దాదాపుగా అన్నిళ్లూ అలానే ఉన్నాయి. అన్నవరం అమ్మానాన్నా యాద్గిరిని చాలా అప్యాయంగా పలకరించారు. అన్నవరం స్నానానికెళ్తూ ‘‘అమ్మా! నువ్వు మా కోసం టిపినేమి చెయ్యకు. ఈడ్ని మురమళ్ళ తీసుకెళ్తున్నా. ఎల్తా ఎల్తా రావులపాలెం ఆర్‌.కె.లో పొట్టిక్కలు తిని పోతాం’’ అని తల్లితో చెప్పాడు.