చాలామందికి తీరని కోరికలు ఉంటాయి. తీర్చుకునే సామర్ధ్యం ఉంటుంది. తీర్చుకుంటారు. కానీ పెద్ద పెద్ద కోరికలైనా వాళ్ళకి పెద్ద సమస్యేమీ కాదు. ఇట్టే నెరవేరిపోతాయి. కానీ చిన్నవాళ్ళకి చిన్న చిన్న కోరికలుంటాయి. ఈ చిన్న చిన్న కోరికలే తీర్చుకునే సామర్ధ్యం ఉండదు. తీరికా ఉండదు. ఎందుకంటే చిన్నవాళ్ళెప్పుడు పెద్దవాడి దగ్గర చాకిరీ చేస్తూ ఉండాలి. ఈ కథలో కూడా ఇలాగే కిట్టిగాడికి ఉన్నది చాలా చిన్న కోరిక. ఎంత ప్రయత్నించినా ఆ కోరిక తీరలేదు. చివరికి.....
******************
కిట్టిగాడు భూమ్మీద పడేసరికి అతని తండ్రి ఆరోగ్యస్థితి పాడైపోయింది. తాగుడువల్ల వచ్చే అనర్థాలకు అతని శరీరం లొంగిపోయింది. తల్లి ఊళ్ళోనే ఐదవ తరగతివరకూ చదివించింది. ఆ ఊరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. పై చదువులకి పక్క ఊరికి వెళ్ళాలి. ఇక చదివించే స్థోమత లేక వాడిని రాజయ్యకి అప్పగించింది. ఆ తర్వాత మూణ్ణెల్లకే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందీ ఎవరికీ తెలియదు.ఆ ఊళ్లో సుమారు మూడువేల గడపలుంటాయి. చుట్టుప్రక్కల అంతా వందలఎకరాల పచ్చని పొలాలు కళకళలాడుతుంటాయి. ఆ ఊరిలో భూకామందు రాజయ్య, మునుసబు కూడా. అతడు అజాతశత్రువు. ఎవరికైనా సహాయం చేస్తాడేతప్ప అపకారం చేయడు.
ఉపకారం చేసేముందు రాబోయే రోజుల్లో కలిగే లాభనష్టాలను అంచనా వేయడంలో దిట్ట.కిట్టిగాడిని వాడి తల్లి తనకు అప్పగించినప్పుడు రాజయ్య అదే లెక్కలు కట్టాడు. వాడిని పదేళ్ళప్రాయంలో చేరదీస్తే గేదెల ఆలనా పాలనా చూడటం ఇంటి పనులు చెయ్యడం దగ్గర నుంచి ఎదిగిన తర్వాత పొలంపనులు చూసేవరకు పనికి వస్తాడని వాడిలోని చురుకుదనంచూసి గ్రహించాడు. అందువలననే కిట్టిగాడి తల్లి అడగగానే ఒప్పుకున్నాడు.కిట్టుగాడు తల్లికోసం మొదట్లో ఎదురుచూసేవాడు. ‘‘నాన్న ఎలా ఉంటాడో తెలియదు. నువ్వు ఉన్నావనుకుంటే నువ్వు కూడా నన్ను అనాథనుచేసి బాధ్యత వదిలించుకున్నావుకదమ్మా!’’ అనుకుంటూ రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చేవాడు. క్రమంగా రాజయ్య ఇంట్లో పరిస్థితులకు అలవాటు పడ్డాడు. ప్రస్తుతం వాడి వయస్సు పద్నాలుగు సంవత్సరాలు, తెలివైనవాడు. కష్టపడతాడు. ఏ విషయమైనా వెంటనే గ్రహించగలడు, ఆచరించగలడు, వాడి కోరిక ఒక్కటే తనివితీరా నిద్రపోవాలని.