కాలింగ్ బెల్ కొట్టిన నిముషానికే తలుపు తెరిచిన యువకుడిని చూసి ‘‘బాబూ, నిన్న పేపర్లో ఈ ప్రకటన ఇచ్చింది మీరే గదా’’ తన చేతిలో పేపరుచూస్తూ అడిగింది సీతమ్మ.‘‘ఆ... ఆ... అవును.. రండి.. లోపలికి... మాట్లాడుకుందాం’’ ఆమెని చూడగానే అతని మొహంలో ఒక విధమైన రిలీఫ్‌లాంటి భావం కదలాడింది.
ఆ వీధిలో అనేక అపార్ట్‌మెంట్ల మధ్య మిగిలిన ఒకే ఒక మేడ ఇల్లు. చుట్టూ చిన్నతోట. ముందు రకరకాల పూలమొక్కలు.. చుట్టూచూసి లోపలికి నడిచింది సీతమ్మ. పెద్దహాలు, పాతకాలం కిటికీలు, గుమ్మాలు, షోకేసుల్నిండా రకరకాల బొమ్మలు – విక్టోరియన్ టైపు సోఫాలు, సెంటర్ టేబిలు... గోడల మీద రకరకాల ఫొటోలు ఉన్నా వారిల్లు అని చెప్పకనే చెపుతున్నాయి. ‘‘కూర్చోండమ్మా అలా... మీ పేరు..’’ తను కూర్చుంటూ అన్నాడతను.‘సీత... సీతమ్మ అండి..’ ‘‘మీది ఈ ఊరేనా, మీకెవరూ లేరా, వంటరి వారా, మా ప్రకటన అంతా చదివారా..’ అన్ని ప్రశ్నలు ఒకసారి వేశాడు.‘ఎవరన్నయ్యా వచ్చింది’ లోపల్నించి వస్తూ సీతమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూసి అడిగింది ఆ యువతి.‘‘నిన్న మన ప్రకటన చూసి వచ్చారు.
నా పేరు మాధవ్. ఈమె నా చెల్లెలు మాధురి’’ అండి. మేమే మా అమ్మగారి కోసం ఆ ప్రకటన ఇచ్చాం..’’‘‘అన్నయ్యా అమ్మ గదిలోకి వెళ్ళి మాట్లాడుదాం, ఆవిడా చూడాలి గదా అన్ని విషయాలు ఆవిడెదురుగా మాట్లాడితే నయం గదా’’ అంటూ ‘లోపలికి రండి అంది మాధవి. అవునులే. మళ్ళీ మనం చెప్పనక్కరలేకుండా ఆవిడ ఎదురుగా మాట్లాడడం మంచిది’ అంటూ అతను లేచాడు.లోపల గదిలో, పాత కాలం పందిరి మంచం మీద, తలగడల మీద ఆనుకుని కూర్చున్న ఆమె పండి మగ్గిన జాంపండు రంగు, వెండి తీగల్లాంటి జుత్తు, కళగా ఉన్నమొహం ఎనభై పైబడిన వయసు ఆమెని చూడగానే గౌరవభావం కల్గి చేతులు జోడించి నమస్కరించింది సీతమ్మ.‘‘అమ్మా, ఈవిడ సీతమ్మగారని మన ప్రకటన చూసి వచ్చారు’’ కొడుకు అన్నాడు. ఆమె తల ఊపి ‘అలా కూర్చోండమ్మా’ అంది కాస్త అస్పష్టంగా.