పదేళ్లక్రితం ఓ అమెరికన్‌ కంపెనీలో పనిచేసేవాడు పిచ్చయ్య.మంచిజీతం, మంచి పనివాతావరణం, ఇంట్లో తెలివైన భార్య ఇద్దరుపిల్లలతో హాయిగా సాగుతున్న అతడి జీవితాన్ని ప్రక్కింట్లో పెద్దాయన ఓ మలుపు తిప్పాడు. ‘‘మీరు చేస్తున్న రంగంలోనే కొత్తగా ప్రభుత్వకర్మాగారం నిర్మాణంలో ఉంది, అందులో చేరితే ఎదగడానికి అవకాశాలు ఎక్కువ’’ అంటూ వద్దన్నా వినకుండా పిచ్చయ్యతో దరఖాస్తు చేయించి, తన పరపతితో ఆ ఉద్యోగం వచ్చేలా చేశాడు ఆ పెద్దాయన. భార్య బలవంతం మీద ఇక ఆ ఉద్యోగంలో చేరక తప్పలేదు పిచ్చయ్యకి.

కొత్త కర్మాగారంలో, నెంబర్‌ టూ, నెంబర్‌ త్రీ ర్యాంకుల్లో ఉన్నవారు జనరల్‌ మేనేజర్‌ బంధువులు. నెంబర్‌ టూ కి కనీసం ప్రాజెక్టు డ్రాయింగులు చూడటం కూడా రాదు. తన కంటె తక్కువ అనుభవం ఉన్న వాడిని ఉత్తరాదినుంచి తెచ్చుకున్నాడు. మీటింగులు జరిగినప్పుడు, డ్రాయింగుల్లో బాస్‌ తప్పులుచూపిస్తే, చిన్నపిల్లాడిలా నాలిక కరుచుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఇంకోడిది అతివినయం. వాడి అనుభవం ఈరంగానికి సంబంధించినది కాకపోయినా అన్నీ తెలుసన్నట్టు బిల్డప్‌ ఇస్తుంటాడు.‘‘రోజంతా గోళ్లు గిల్లుకుంటున్నాం.

నువ్వు నమ్మవుగాని సైటుచుట్టూ కంచెవేయడానికి ఆరునెలలనుంచి సైటు ఆఫీసుకు హెడ్‌ ఆఫీసుకు కరస్పాండెన్సు సాగుతోంది తెలుసా?’’ ఇంటికి రాగానే భార్య మాధవితో ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు చెబుతూ ఫ్యాక్టరీ కబుర్లనీ ఆమెతో పంచుకుంటాడు పిచ్చయ్య.‘‘మావాళ్లు ఇరవైమంది జపాన్‌ టూర్‌ వెళ్తున్నారు. ఎందుకని అడగవేం! ఇక్కడ భవిష్యత్తులో భూకంపంవస్తే నిర్మాణంలో ఉన్నప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయడానికట!! జపాను భూకంపాల దేశంకదా. రక్షణకోసం వాళ్ళు అక్కడ ఉపయోగించే టెక్నాలజీ ఏమిటో అడిగి తెలుసుకోవడానికి అవసరమైన ఓ ప్రశ్నావళి ని తయారుచేసే బాధ్యత నాకే కప్పజెప్పారు’’ భార్యతో గొప్పగా చెప్పాడు పిచ్చయ్య.