చెన్నైలో విమానం గాల్లోకి ఎగిరి అమాంతం వచ్చి సముద్రం మీద వాలినట్లైంది. తీరం దాటగానే కెరటాలన్నీ చలించడం మానేశాయి. విమానం నీడ బంగాళాఖాతం మీద ఓ పెద్ద పక్షి ఎగురుతున్నట్టుగా ఉంది. సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఆ విమానం పక్షిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తోంది ధరణి.
అండమాన్ మీద ఆకర్షణ ఈనాటిది కాదు. ఎప్పటి నుండో చూడాలనుకుంటున్న ప్రాంతం. వస్తామని నమ్మబలికిన అందరూ చేతులెత్తేసినా ధైర్యం తెచ్చుకొని ఒక్కర్తీ బయలుదేరింది. అండమాన్ దూరదర్శన్‌లో పనిచేస్తున్న శారద ప్రోత్సాహం కూడా ఈ ప్రయాణం వెనుక ఉంది.ఊపిరాడని మార్చి నెల ఒత్తిడి ముగిసాక ఏప్రిల్ మొదటి వారంలో తన ప్రయాణం ఖరారు చేసుకుంది. శారదకి ఫోన్ చేస్తే ‘వచ్చేయ్’ అని భరోసా ఇచ్చింది. తన ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ మొదట ఉత్సాహం చూపారు కానీ చివరి నిమిషంలో జారిపోయారు. ధరణి ఆలోచనల్ని చెదరగొడుతూ లాండింగ్ అనౌన్స్‌మెంట్ వినిపించింది. పది నిమిషాల తర్వాత పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో దిగి శారదకి ఫోన్ చేసింది. ‘ప్రస్తుతం ఎయిర్ పోర్టుకి రాలేనని, టాక్సీ తీసుకొని, ముందే బుక్ చేసిన హోటల్‌కి వెళ్లిపొమ్మని, సాయంత్రం కలుస్తాన’ని చెప్పింది శారద.
బయటకు వచ్చి టాక్సీ మాట్లాడుకుని హోటల్ అడ్రస్ చెప్పింది ధరణి. డ్రైవర్ చక్కటి తెలుగులో ‘‘తెలుగువారా అండీ?’’ అన్నాడు‘‘అవును .. ఎలా తెలిసింది’’ అంది ఆశ్చర్యంగా.‘‘అదే నా గొప్పతనమండి ... తెలుగువాళ్ళని ఇట్టే గుర్తుపట్టేస్తాను’’ గొప్పగా చెప్పాడు.ధరణి నవ్వి, ‘‘హోటల్ ఇంకెంత దూరముంది?’’ అడిగింది.‘‘అయిదు నిమిషాల్లో హోటల్ వస్తుంది..’’ అన్నాడు.చెప్పినట్లే అయిదు నిమిషాల్లో హోటల్ ముందున్నాడు. హోటల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక తనకి కేటాయించిన రూమ్ కెళ్ళింది. బాయ్ సామాను తెచ్చి పెట్టి వెళ్ళాడు.డోర్ లాక్ చేసి, కర్టెన్ పక్కకి లాగి అలానే నిలబడిపోయింది.
ఎదురుగా నీలంగా మెరుస్తున్న సముద్రం. పక్కనే కొండలు. ‘మా సముద్రం నీళ్లెందుకు ఇంత నీలంగా ఉండవో, ఒకే సముద్రం కదా.. ’ అనుకుంటే నవ్వొచ్చింది ధరణికి.కర్టెన్ అలాగే తీసి ఉంచి మంచం మీద వాలిపోయింది. కళ్లు మూసుకున్నా అంతా నీలమే .. సముద్రం ఒళ్ళో పడుకున్నట్లుంది. ‘ఈవారం రోజులూ తనతో ఉండేది సముద్రమే కాబోలు. ‘నేను ... సముద్రం’ కవిత రాయాలనిపించింది. బద్దకంగా అలాగే పడుకుంది. కళ్లముందు ఏవో నీడలు ...