మూడు తరాల స్ర్తీలను చూశాడతను. అంటే మూడు రకాల జీవితాలు. ఆ జీవితాల్లో ఏ మార్పూ అతడికి కనపించలేదు. నానమ్మ అంటే అతడికి వల్లమాలినప్రేమ. ఆమె ఆజానుబాహువు. అంత అందగత్తె ఈ కాలంలోనూ లేదనేదే అతడి అభిప్రాయం. ఆమె ఈ కాలం హైటెక్ ఉమన్‌లా ఉండాలని కోరుకునేవాడు. నానమ్మా నన్ను పెళ్ళాడతావా? అని అడిగేవాడు. అప్పుడామె ఏమనేది? అసలు అతగాడు కోరుకున్నదేమిటి?
నేను ప్రేమించిన మొదటి స్త్రీ మా నానమ్మ. మా బండయ్య దగ్గరే ఉంటాను అనేది మా నానమ్మ. నేను కూడా నానమ్మతోనే ఉంటాననేవాడిని. నానమ్మ చనిపోయి నలభైఏళ్ళ తర్వాత ఇప్పుడు నా ఊహల యవనిక మీద నానమ్మను బొమ్మలు బొమ్మలుగా ముద్రించుకుంటున్నాను. ఇప్పుడనేమీ లేదు. నానమ్మ ఎప్పుడూ గుర్తొస్తుంది. కూర నచ్చకపోతే గుర్తొస్తుంది. ఆడవాళ్ళు ఎవరూ నచ్చకపోతే గుర్తొస్తుంది. ప్రేమ తక్కువైనప్పుడు గుర్తొస్తుంది. పిలుపుల్లో ఆప్యాయత లోపించినప్పుడు గుర్తొస్తుంది. నా మొదటి చివరి ప్రేమికురాలు మా నానమ్మే.నాకు పద్దెనిమిదేళ్ళ వయసులో మా నానమ్మ చనిపోయింది. ఆమెకప్పుడు ఒకటి రెండేళ్ళు అటూ ఇటుగా సుమారు ఏభయ్యేళ్ళు . పద్నాలుగు సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల వయసున్న మా తాతయ్యకు నాలుగో పెళ్ళాంగా మా ఇంట్లోకొచ్చింది.
ఆమెకు పదహారేళ్ళకే మా నాన్న పుట్టాడు. ఆయనకు పదహారేళ్ళకే పెళ్ళయింది. అప్పుడు మా అమ్మ వయసు పదకొండు. సరిగ్గా మా అమ్మకు పద్నాలుగో ఏటనే నేను పుట్టాను. వస్తూ వస్తూ మా నానమ్మ బాల్య వివాహాల పరంపరను మా ఇంటికి మోసుకొచ్చినట్టుంది. మా చెల్లికి కూడా పద్నాలుగు పదిహేనేళ్ళకే పెళ్ళి చేశారు. దానితో పాటు పనిలో పనిగా నాక్కూడా చేసేశారు. నాకప్పుడు పదిహేడుంటాయి. మా తాతయ్య చనిపోయే నాటికి నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. తాతయ్యే నా రూపంలో పుట్టాడని ఎవరనుకున్నా అనుకోకపోయినా నానమ్మ మాత్రం గట్టిగా అనుకునేది. అందుకే పేరుపెట్టి ఎప్పుడూ పిలిచేది కాదు. బండయ్య అని పిలిచేది. అంత చిన్నప్పుడు పెళ్ళి చేసుకున్న మా నానమ్మ ఆ వయసులో ఎలా ఉండేదో నేను కొంచెం పెద్దయ్యాక, కళ్ళు తెరచి లోకాన్ని చూశాక ఊహించుకునేవాణ్ణి.