‘‘నా పేరు తిరుపాలమ్మ!’’ దిగ్గున లేచి కూర్చున్నా. ఒళ్లంతా చెమటలు. టైం చూద్దామని మొబైల్‌ ఆన్‌ చేశాను - ఒకటిన్నర. మొబైల్‌ ఆఫ్‌ చేసి పడుకోవడానికి ప్రయత్నించా. నిద్ర రాలేదు, రాదనీ తెలుసు. ఇలా అర్ధరాత్రి దాటాక తిరుపాలమ్మ కలలోకొచ్చి, ఉలిక్కిపడేలా లేపటం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిసారి కూడా కాదు. నాలుగేళ్ల నుంచి రెండు మూడు నెలలకోసారి ఇలా జరుగుతూనే వుంది. తి...రు...పా...ల...మ్మ...! నన్ను వెంటాడుతున్న అయిదక్షరాల పేరు మాత్రమేనా?చచ్చేంత చిరాగ్గా వుంది. గెజిటెడ్‌ హోదా... అదీ డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దే అత్యంత గౌరవనీయమైన అధ్యాపక వృత్తిలో వుండి, మండుటెండల్లో చెమటలు కార్చుకుంటూ, పాంఫ్లెట్స్‌ పట్టుకొని ఊరూరూ తిరుగుతూ, ‘‘బాబ్బాబు... మా కాలేజీలో చేరండి. అమ్మా, అయ్యా మీ పిల్లల్ని మా కాలేజీలో చేర్చండి’’ అంటూ అడుక్కోవడమేంటి అసహ్యంగా. ఏంచేస్తాం, తప్పదు మరి! ఏడేళ్ల క్రితం నేను యిదే కాలేజీలో పన్జేసినప్పుడు పద్నాలుగొందల మంది పిల్లలుండేవారు. ఇప్పుడా సంఖ్య ఆరొందలకు పడిపోయింది. కాలేజీలు నిలబడా లన్నా, పోస్టులు పోకుండా కాపాడుకోవాలన్నా తప్పదు, ఊళ్లన్నీ తిరిగి పిల్లలను రాబట్టుకోవాలి ప్రైవేట్‌ కాలేజీలకు మల్లే.‘‘సీమ పల్లెలు ఎప్పుడూ చూసెరగం కదా, పోనీలే యిప్పుడన్నా చూడొచ్చు’’ అంటూ పక్కకు చూశాను. ఏదీ ఈ ప్రసన్న?నాతోపాటు క్యాంపెయిన్‌కి వచ్చిన ఎకనామిక్స్‌ లెక్చరర్‌ ప్రసన్న, యెటు పోయింది? చుట్టూ చూస్తే ఓ చిన్న గుడిలో నుంచి వస్తోంది చేతిలో పాంఫ్లెట్స్‌ విసనకర్రలా వూపుకుంటూ.చిరాకు మరింత పెరిగి ‘‘యెక్కడికెళ్లినా యీ గుళ్ళూగోపురాలూ వొదిలిపెట్టవా?’’ అన్నాను. ప్రసన్న నాకంటే యేడెనిమిదేళ్లు చిన్నది, ఆ చనువుతోనే పేరుపెట్టి పిలుస్తాను.‘‘గుళ్లోకి దేవుణ్ని పలకరించడానికి పోలేదు మేడమ్‌. జనాలు దండిగా వుంటారు కదా, వొకేసారి చాలామందిని కలవొచ్చు. చూడండి యెన్ని పాంఫ్లెట్స్‌ అయిపోయాయో?’’ చేతిలోపాంఫ్లెట్స్‌వూపుతూ అన్నది.‘‘సర్లే.. పోదాం పదా’’ ముందుకు నడిచాన్నేను.ఒక్కో సందు తిరుగుతూ, యింటర్మీడియట్‌ చదువుతున్న పిల్లలున్నారేమోనని వాకబు చేస్తూ ముందుకు సాగుతున్నాం.‘‘యే ప్రైవేటు కాలేజీలోనూ లేని వసతులు మా గవర్నమెంట్‌ కాలేజీలో వున్నాయి. మంచి లైబ్రరీ, ఆధునిక పరికరాలున్న లేబరేటరీలు, డిజిటల్‌ క్లాసు రూములు, కంప్యూటర్లు, క్వాలిఫైడ్‌ లెక్చరర్లు...’’ నలుగురు పోగయిన చోట గొప్పగా చెబుతున్నాం గానీ మా భాష వాళ్లకర్థమవుతోందో లేదో తెలియడం లేదు. కన్నడ కలిసిన వింతైన యాసలో వాళ్లు మాట్లాడే మాటలు మాకర్థం కావట్లేదు. అయినా మా ప్రయత్నం మేం చేస్తున్నాం.

                                    *********************************************************