ప్యాసింజర్ రైలు వచ్చి స్టేషన్‌లో ఆగింది. రఘు పరుగున వెళ్లి స్లీపర్‌కోచ్ దగ్గర ఆగాడు. అందులోంచి మధూలిక బ్యాగ్‌తో సహా దిగి అతనికోసం ఎదురుచూస్తూ కనిపించింది.కొద్దిసేపటికి రఘు దగ్గరకు వచ్చి ‘‘నువ్వు రఘు బావ కదూ’’ అంది కళ్ళు పెద్దవిగా చేస్తూ.‘‘అవును, ఏం...పోల్చుకోలేనంతగా కనిపిస్తున్నానా?’’ అని నవ్వుతూ ఆమెచేతిలో బ్యాగ్ అందుకున్నాడు రఘు.
‘‘అవును, పది సంవత్సరాలైందిగా నిన్నుచూసి. బాగా మారిపోయావు...మరి నేను?’’ అంది అతని వెనకాల నడుస్తూ! ‘‘పెద్దగా లేదులే, కాకపోతే కొద్దిగా పొడుగయ్యావు’’ కారువైపు నడుస్తూ చెప్పాడు రఘు. ఆమె కార్లో కూర్చోకుండా చుట్టూచూస్తూ ‘‘ఇన్నాళ్ళకు మన ప్రాంతం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తోంది’’ అంది కళ్ళు తుడుచుకుంటూ. అతను కారు డోరు తెరుస్తూ ‘‘అబ్బో! అంత బాధ ఉంటే ఇన్నాళ్ళు నువ్వుగానీ, మీ నాన్నగానీ మన ఊరు ఎందుకు రాలేదు? మీ నాన్నైతే ఏకంగా మన ఊరు ముఖం కూడా చూడనని, ఒట్టువేసిమరీ వెళ్లాడు కదా?’’ అన్నాడు రఘు కోపంగా.కారు మెత్తగా దూసుకుపోతోంది రోడ్డుమీద.వాళ్ళ ఊరు కౌసల్యాపురం అక్కడికి పదిహేను కిలోమీటర్లు. ఉదయపువేళ కావడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. దూరంగా హరితవర్ణపు పంటచేలమీద తెల్లని కొంగలు ఎగురుతూన్న దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూడసాగింది మధూలిక.
రఘు మేనమామ ప్రద్యుమ్నరావ్ కూతురు మధూలిక. పదేళ్లక్రితందాకా అతను అక్కడికి దగ్గర్లోని పట్నంలో లెక్చరర్‌గా పనిచేస్తూండేవాడు. ఆ తరువాత అక్కడి పరిస్థితులకు ఇమడలేక అమెరికా వెళ్ళిపోయాడు. అప్పటికి మధూలిక ఏడవ తరగతి చదువుతుండేది. రఘు, ఆమె కలిసి పొరుగూరు హైస్కూల్లో చదివేవారు. అప్పుడు వెళ్లిపోయిన వాళ్లకుటుంబం ఇప్పటిదాకా ఇండియాకి తిరిగిరాలేదు. నాలుగురోజులక్రితమే ప్రద్యుమ్న రఘుకి ఫోన్‌చేసి మధూలిక వస్తున్నట్లు చెప్పాడు. అందుకే రఘు ఈ రోజు స్టేషన్‌కి వచ్చాడు.