మనిషిని మనిషి నమ్మలేక, మరో మనిషిని కాపలా పెట్టే ఒప్పందానికి మంతనాలు జరుగుతున్నాయి.‘‘సర్‌, రెండు ఫ్రంట్‌ గేట్లు, రెండు బ్యాక్‌ గేట్లు, క్లబ్‌ హౌస్‌, టెంపుల్‌ ఏరియా, రాంగ్‌ పార్కింగ్‌ చెయ్యకుండా రెండు సెల్లార్‌ పార్కింగ్‌లలో ఇద్దరు, మొత్తం ఎనిమిది పాయింట్లు, రోజుకి మూడు షిఫ్ట్‌లు, ఒక్కొక్కరు ఎయిట్‌ అవర్స్‌ డ్యూటీకి పన్నెండు వేల అయిదొందల చొప్పున, జి.ఎస్‌.టి తో బాటు నెలకి మూడున్నర లక్షలు అవుతుంది సర్‌’’ అన్నాడతను ఇంగ్లిష్‌లో.‘‘బాగా ఎక్కువయ్యా. అయినా ఎయిట్‌ అవర్స్‌ డ్యూటీ ఏంటి, ట్వెల్వ్‌ కదా?’’ అడిగారు ప్రెసిడెంట్‌ చైర్‌లో కూర్చున్నాయన.‘‘ఓకే సర్‌, అలా అయితే పదిహేను వేల చొప్పున మూడు లక్షలు అవుతుంది సర్‌.’’‘‘ఎప్పుడైనా ఒకడు డ్యూటీకి రాకపోతే ముప్పై ఆరు గంటలు కంటిన్యూ చెయ్యగలరా?’’ అడిగారు ప్రెసిడెంట్‌.‘‘అవసరమైతే వరుసగా మూడు షిఫ్ట్‌లు చెయ్యగలరు, వాళ్లకి అలవాటే. యూనిఫారం కూడా నీట్‌గా ఉంటుంది. మీరు ఒకే అంటే అగ్రిమెంట్‌ రెడీ చేస్తాను’’ మానిఫెస్ట్‌ చదివాడతను.‘‘యూనిఫారం అక్కరలేదంటే ఏదైనా తగ్గిస్తారా’’ అడిగారు ట్రెజరర్‌.‘‘భలేవారు సర్‌. అసలు సెక్యూరిటీ అంటే సగం ప్రోటోకాల్‌ కోసమే కదా సర్‌. మీరు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, స్టిఫ్‌గా నుంచుని సెల్యూట్‌ చేసి గేటు తీస్తే ఆ దర్జానే వేరుసర్‌.’’‘‘అవునవును, యూనిఫారం ఉండాలి. లేదంటే వాళ్ళు జీన్స్‌, టీ షర్టు వేసుకొస్తే, మనకీ వాళ్ళకీ తేడా ఉండొద్దా’’ అన్నారు మరో కమిటీ మెంబరు. ఈయన ప్రభుత్వ అధికారిగా రిటైర్‌ అయిన దగ్గరనించి ఇంటా బయటా మర్యాదకి మొహం వాచి ఉన్నారు.‘‘మరొక విషయం సర్‌. నాకు లాకర్‌ డీలర్‌ షిప్‌ కూడా ఉంది. మన కమ్యూనిటీలో వాళ్లకి 20ు డిస్కౌంట్‌ ఇస్తాను’’ అన్నాడతను మానిఫెస్ట్‌ ఇంకా పూర్తవనట్టు.‘‘మీరు లాకర్లు అమ్ముతున్నారంటే మీ సెక్యూరిటీ అంత స్ర్టాంగ్‌ కాదనేగా’’ అడిగారు ప్రెసిడెంట్‌ నవ్వుతూ.‘‘భలేవారే సర్‌. ఈతొచ్చు కదా అని బోటెక్కినప్పుడు లైఫ్‌ జాకెట్‌ వేసుకోకుండా ఉంటామా, ఇదీ అంతే’’ అన్నాడతను నవ్వుతూ. అందరూ టీ తాగి సమోసా తిన్నారు.

                                                       **************************************