పెద్దనకి ఓ కూతురు. పేరు తులసి. పెద్దగా చదువుకోలేదుగాని, తులసికి ఉన్నన్ని తెలివి తేటలు ఊరిలో వేరెవరికీ లేవంటాడు పెద్దన. రాచవంశంలో పుట్టాల్సిన పిల్ల, రైతు కుటుంబంలో పుట్టిందని బాధపడుతుంటాడు. పెళ్ళీడుకి వచ్చింది తులసి.‘‘పెళ్ళి చేసేయ్‌! ఓ బాధ్యత తీరిపోతుంది.’’ అంటే:‘‘మంచిరాజు దొరకాలిగా’’ అన్నది పెద్దన మాటే కాదు, పాటవుతున్నది పదే పదే!రాజ్యంలో సరి అయిన మంత్రి లేడంటాడు పెద్దన. మంత్రులంతా వాజమ్మలంటాడు. ఒక్కరికీ సరైన తెలివితేటలు లేవు, ఉంటే ఈ రాజ్యం ఇలా ఎందుకుంటుంది? అంటాడు. రాజ్యానికేం, బాగానే ఉంది. కాకపోతే తులసిని గురించి గొప్పగా చెప్పడం కోసం పెద్దన నోటికొచ్చినట్టల్లా వాగుతూ రాజుగారి కళ్ళల్లో కూడా పడ్డాడు. ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసం రాజుగారు మారువేషంలో రాజ్యంలో పర్యటిస్తుండగా, పెద్దన మాటలు అతని చెవినపడ్డాయి.‘‘వారసత్వం వల్ల రాజయ్యాడుగాని, అబ్బే... అతనికేం తెలివితేటలు ఉన్నాయని? రాజంటే ఎలా ఉండాలి? మా తులసిలా ఉండాలి. దాని తెలివితేటల ముందు మన రాజు ఎందుకూ కొరగాడు.’’ అన్నాడు పెద్దన. రాజుకి ఆ మాటలు కోపాన్ని తెప్పిం చాయి. అప్పటికప్పుడే పెద్దనను శిక్షించాలనుకున్నాడు. కాని తొందరపడకూడదనుకుని, కోపాన్ని అదిమిపెట్టుకుని వెళ్ళిపోయాడు.మర్నాడు రాజాస్థానానికి రమ్మని పెద్దనకు కబురు అందింది. అతన్ని తోడుకుని వెళ్ళేందుకు భటులు కూడా వచ్చారు.‘‘నన్ను రాజుగారు రమ్మన్నారు, రాజుగారు నన్ను రమ్మన్నారు.’’ అని ఊరూవాడా చాటింపులా చెప్పుకుంటూ రాజాస్థానానికి చేరుకున్నాడు పెద్దన. సభలో రాజుగారు తప్ప ఎవరూ లేరు. భయం వేసింది పెద్దనకు.సింహాసనం మీద రాజుగారు సింహంలా కూర్చున్నారు. కొరకొరా చూస్తున్నారు. ఆ చూపుకి వణికిపోతూ నిల్చున్నాడు పెద్దన.

‘‘ఇలా రా’’ పిలిచారు రాజుగారు. వెళ్ళి చేతులు కట్టుకుని, తల వంచుకున్నాడు పెద్దన.‘‘మీ అమ్మాయి తులసి అంత తెలివైందా?’’ అడిగారు రాజుగారు.‘‘బాగా’’ అన్నాడు పెద్దన, అంత భయంలో కూడా.‘‘అలాగేం! అయితే ఓ పని చెయ్యి, నేను నీకు కొన్ని కోడిగుడ్లు ఇస్తాను. వాటిని తీసుకుని వెళ్ళి మీ అమ్మాయికి ఇవ్వు. రేపటిలోగా వాటిని ఆమె కోడిపిల్లల్ని చెయ్యాలి, ఇది రాజాజ్ఞ అని చెప్పు. చేస్తే వెయ్యి వరహాలు ఇస్తాను.’’