‘‘నేను’’నేను అంటే ఉత్తమ పురుషలో ‘‘నేను!’’అంటే ఉత్తమమైన పురుషుడిని అని కాదు. ఉత్తి స్వార్థపూరితమైన ‘‘నేను’’ అని.నా పేరు చెప్పడం ఇష్టం లేని ‘‘నేను’’నా పేరు చెప్తే నా కులమో, మతమో, ఊరో, దేశమో ఏదో ఒకటి మీకు తెలిసిపోతుంది. తెలిస్తే నన్ను బలపరచడమో, వ్యతిరేకించడమో చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఒక మనిషిని అని మీరు గ్రహిస్తే చాలు. అందుకే నా పేరు చెప్పడం లేదు.
ఇంతకీ నన్ను నేను ఎందుకు పరిచయం చేసుకుంటున్నానంటే నాకు మీతో పనిబడింది. మీ సలహా నాకు కావాలి. సమస్య చెప్పకుండా సలహా అడుగుతున్నాను కదా... సారీ. అలసిపోయి డ్యూటీ దిగి ఇంటికెళ్తున్న పోలీస్‌లాగా ఉన్నాడు సూర్యుడు. పోలీస్ అటెళ్ళగానే దోపిడీకి సిద్ధమవుతున్న గజదొంగల్లాగా చీకట్లు జీరాడుతున్నాయి.నేను నైట్ డ్యూటీకి వచ్చాను. చెప్పలేదు కదా నేను జైలులో సెంట్రీనీ. జైలర్‌గారి గదికివెళ్ళి హాజరు వేయించుకుని నా గన్ తీసుకుని జైలులో మిగతా ఖైదీలకు దూరంగా కరుడుగట్టిన ఉగ్రవాదులను ఉంచే జైలు గది దగ్గరికి వచ్చాను. రాత్రంతా అక్కడే నా డ్యూటీ.
ఎప్పుడో బ్రిటిష్‌వాళ్ళ హయాంలో కట్టించిన గదులు. మద్రాస్ టెర్రస్. ఆ గదిలో పైన అందనంత ఎత్తులో చిన్న వెంటిలేటర్ లాంటిది ఉంది. గదికి ఇనుప ఊచల తలుపు.ప్రస్తుతం లోపల ఒకడే ఉగ్రవాది ఉన్నాడు. వాడి కాళ్ళుచేతులు గొలుసుతో బంధించి ఉన్నాయి. గది బయట కర్రలూ, చెక్కలు ఇంకా పనికిరాని చెత్తాచెదారం పడి ఉంది. ఒక మూలగా ఉండడంవల్ల చెత్తంతా ఇక్కడే పడేస్తారు. బయట చెత్తలో తేళ్ళు, పాములుంటాయి. వాటికన్నా లోపలున్న ఉగ్రవాది అంటేనే నాకు భయం. ఆ భయంతోనే రాత్రి నిద్రరమ్మన్నా రాదు నాకు.