తప్పు చేసినవాడు ఎప్పుడో నరకానికెళ్ళి శిక్ష అనుభవించడం ఒఠ్ఠి అబద్ధం. ఇక్కడే ఈ జన్మలోనే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. ఇది నిత్య సత్యం. ఆ ఊళ్ళో ఇప్పుడు వెంకన్నదొర పరిస్థితి కూడా అంతే. ఎంతమంది తల్లుల ఉసురు తగిలిందో! ఎంతమంది ప్రాణాలు తీశాడో! చేసిన పాపం ఊరికే పోతుందా? కూర్చున్న కొమ్మ నరుక్కున్నచందంగా ఆ ఉసురిప్పుడు అతడింటినే చుట్టుముట్టింది! ఇంతకీ ఏం జరిగిందంటే....
*************************
ఘోరప్రమాదమే అది!ప్రారంభోత్సవం రోజే ఆ బ్రిడ్జి బ్రిటానియా బిస్కట్‌లా రెండు ముక్కలై నిట్టనిలువునా కూలిపోయింది.అవతలి ఒడ్డుకి దగ్గరగా ఉన్న రెండు పిల్లర్లు నీటిలోకి నిశ్శబ్దంగా నిమజ్జనమైపోయాయి.ఎన్నాళ్ళగానో ఆ రెండు తీరాల జనం కన్నకలలు నిజమవుతున్నట్లే భ్రమ కలిగించి నిలువునా కూలిపోయిందా వంతెన!జనం ఆనందంగా దాని ప్రారంభోత్సవం చూద్దామనుకుని వచ్చి చేసిన హాహాకారాలకి ప్రవాహ సవ్వడిని తనలోనే దిగమింగుకుని స్థాణువై నిలబడిపోయింది ఆ నది.నిజానికి ఆ నదిలో ఇంతకంటే ఘోర ప్రమాదాలు ఇంతకుముందే జరిగేయి.నలభైమందిని మోసుకొస్తున్న లాంచి ఉన్నట్టుండి నదిలోకి కుంగిపోయి ఏ ఒక్కరి ఎడ్రస్సూ దొరక్కుండా అట్టడుగుకి వెళ్ళిపోయింది. ఈతకొచ్చిన పిల్లలు ఒడ్డునే నీటిలో దిగబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఆ తల్లులు పొర్లిపొర్లి ఏడ్చిన ఏడుపులు ఆ ఒడ్డు నిశ్శబ్దంగా మింగేసింది. అలసి సొమ్మసిల్లిన అమ్మల్ని ఆ సైకతపాన్పు అక్కున జేర్చుకుని ఊరుకోబెట్టింది.మాయదారి నది. మరణదేవత అని పెట్టిన శాపనార్థాల్ని ఆ నది మౌనంగా మింగి ముందుకు సాగుతూనే ఉంది.అయినా ఈరోజు జరిగిన ప్రమాదాన్ని అక్కడి అమాయకపు పాటక జనం అన్నిటికన్నా ఘోరమైనదిగా పరిగణించారు.కారణం రెండు ఒడ్డుల్ని మకుటంలేని మహారాజుగా పాలిస్తున్న వెంకన్నదొర కొడుకు ఆ విరిగిన స్లాబు మధ్యలో ఇరుక్కుని ఘోరంగా మరణించడం!
రెండు తరాలు ఆ ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న వెంకన్నదొర ఏకైక పుత్రరత్నం దొరబాబు విదేశాల్లో చదువుకుని సరదాగా ఇండియావచ్చి ముఖ్యమంత్రిగారి ప్రారంభోత్సవాన్ని మురిపెంగా చూద్దామని తన ఖరీదైన కారులో తండ్రి వెనక బయల్దేరేడు.నిజానికి దొరబాబుని తనే రమ్మని బలవంతం చేశాడు వెంకన్నదొర. అతని మనసులో ఉద్దేశ్యం వేరు. రాబోయే ఎలక్షన్స్‌లో కొడుకుని రాజకీయాల్లో ప్రవేశపెట్టడానికి అది అదునైన సమయమని ఆయన భావించాడు. అందుకే ఈ ఉత్సవాన్ని చాలా ఖర్చుపెట్టి స్వయంగా పూనుకుని చేయిస్తున్నాడు.