అపాత్రదానం అనర్థాలకు మూలం. ప్రతి మనిషికీ ఉపకారబుద్ధి ఉండాల్సిందే. కానీ అది అనర్హులకు ఉపకారం చేసేదిగా మారకూడదు. దానివల్ల ఉపకారం చేసేవాడు కష్టాలపాలు కావడమేకాదు, సోమరులను పెంచిపోషించినవాడవుతాడు. ఈ కథలో కూడా శంభుడు ఇలాగే అపాత్రదానాలు చేశాడు. అందరినీ నమ్మి అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ దానగుణాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఆ దానగుణం ఎంతవరకు వచ్చిందంటే చివరకు బికారిగామారి భార్యాబిడ్డల్ని కూడా వదిలి వెళ్ళిపోయాడు. చివరికి అతడేమయ్యాడు? శంకరగిరిమాన్యాలు పట్టిపోయాడా?
వీరవరంగ్రామంలో ఒక భూస్వామి అవసానదశకు చేరుకున్నాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకు శంభుడితో, ‘‘బాబూ, నీకున్నంతలో ఎప్పుడూ అవసరమైనవారిని ఆదుకో’’ అని చెప్పాడు. ఆ మాటలు శంభుడికి బాగా ఒంటబట్టాయి. తన ఇంటిముందు దేహీ అని చేయిజాచిన బిచ్చగాడినిగానీ, అవసరంలో ఉన్న మిత్రులనుగానీ ఎన్నడూ ఉత్తచేతులతో పంపలేదతడు. శంభుడికి తండ్రి ఇచ్చిన పొలం, స్వంత ఇల్లు ఉన్నాయి. అతడి భార్య సీత అనుకూలవతి. ఆ దంపతులకు ముత్యాలవంటి ఇద్దరు బిడ్డలున్నారు. శంభుడికి ఉన్న ఉపకారబుద్దివల్లనో ఏమో వానలు సరిగ్గా పడకపోయినా, వరదలొచ్చినాసరే - అతడి పంటకుమాత్రం నష్టం వచ్చేది కాదు.వీరవరంలో మల్లయ్య అనే మరో భూస్వామి ఉన్నాడు. శంభుడి పొలంలో పంట దిగుబడి ఎప్పుడూ ఎక్కువగానే ఉండడం చూసి, అతడికున్న పదెకరాలూ తానే కొనుక్కోవాలనుకున్నాడు మల్లయ్య.
అయితే, తనకు తన పొలం అమ్మే ఉద్దేశ్యం లేదని శంభుడు ఆయనకు స్పష్టం చేశాడు. ‘‘ఈ పొలం నాకు అనుకూలమైన చోట ఉన్నది. ఇది నీవు నాకు ఇచ్చేస్తే ఊరిచివర నీకు ఇరవై ఎకరాలు ఇస్తాను. ఉపకారబుద్ది కలవాడివి. నీవంటి వాడికి ఎక్కువ భూమి ఉండడం మంచిది కదా?’’ అని ఆశ పెట్టాడు మల్లయ్య. ఆ మాటలు నిజమనిపించాయి శంభుడికి. తనకు ఎంత ఎక్కువ పొలముంటే, అంత ఎక్కువమందికి సాయపడొచ్చనిపించి, శంభుడు తన పొలాన్ని మల్లయ్యకిచ్చి ఆయనిచ్చిన ఇరవై ఎకరాలూ తీసుకున్నాడు. అలా చేసినందుకు చాలామంది అతడిమీద జాలి పడ్డారు. ఎందుకంటే మల్లయ్య ఇచ్చిన పొలంలో ఏ పంటలూ సరిగ్గా పండవు.