ఒక గ్రామంలో లింగరాజు అనే సంపన్నుడు ఉండేవాడు. అతడు భోజనప్రియుడు. నవకాయ పిండివంటలతో ప్రతిరోజు భోజనం చేసేవాడు. ఇంటిల్లపాదీ ఆ షడ్రుచులకు అలవాటుపడ్డారు. అంతలో అతడికి జబ్బు చేసింది. ఎంతకీ నయం కాలేదు. ఏ ఔషధాలు పనిచేయలేదు. ఇంట్లో పథ్యంతప్ప ఎవర్నీ ఏమీ తిననిచ్చేవాడుకాదు లింగరాజు. దాంతోపాటు అతడివల్ల ఇంట్లోవారికి అనేక కష్టాలు వచ్చిపడ్డాయి. అప్పుడు ఏం జరిగింది?
ఒక గ్రామంలో లింగరాజు అనే సంపన్న గృహస్థుడు ఉన్నాడు. అతడికి తల్లిదండ్రులనుండి వారసత్వంగా పాతిక ఎకరాల మాగాణి, ఒక దివ్య భవనం, లక్ష బంగారు కాసులు లభించాయి. వాటితో అతడి జీవితం వైభవంగా గడచిపోతున్నది.లింగరాజు భార్య సీతమ్మ, భర్తకు అన్నివిధాలా అనుకూలవతి. ఆ దంపతులకు నలుగురు పిల్లలు. ఆడపిల్లకు పెళ్ళయింది. అత్తవారింట సలక్షణంగా కాపురం చేసుకుంటున్నది. మిగతా ముగ్గురూ మగపిల్లలు. పెద్ద వాళ్లిద్దరికీ వివాహాలయ్యాయి. కోడళ్లు కాపురానికి వచ్చారు. వాళ్లు స్వజనంలో ఆత్మీయుల్లా కలిసిపోయారు. అత్తాకోడళ్ల తగువన్నది ఆ ఇంట ఎన్నడూ వినలేదని ఊరిజనం ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. లింగరాజు ఆఖరికొడుకు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. త్వరలోనే అతడి విద్యాభ్యాసం పూర్తవుతుంది. అతడు బుద్ధిమంతుడు. ఉత్తమ ఆదర్శవిద్యార్ధి అని గురువు అతడికి యోగ్యతాపత్రం కూడా ఇచ్చాడు.ఈ విధంగా లింగరాజుకు జీవితం అన్నివిధాలా బాగున్నది.
అయితే, అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నచందంగా లింగరాజును గత కొద్దిమాసాలుగా ఏదో తెలియని అనారోగ్యం పట్టిపీడిస్తున్నది. చూడ్డానికి పుష్టిగా, ఆరోగ్యంగా కనబడతాడు. కానీ ఆకలి మందగించింది. తిన్న తిండి సరిగ్గా అరగడంలేదు. పగలు గట్టిగా నాలుగు అడుగులువేస్తే ఆయాసం వస్తున్నది. రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టడంలేదు.లింగరాజు భోజనప్రియుడు. వంటలు, రుచులు గురించి అతడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ప్రతిరోజూ భోజనంలోకి పిండివంట ఉండాల్సిందే. ఆ పిండివంట రోజురోజుకి మారాల్సిందే! అటువంటి లింగరాజుకు ఆకలి మందగించింది. తిన్నది అరగడంలేదు. దాంతో ఇంట్లో కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. లింగరాజు తానేమీ తినలేకపోతున్నానని ఇంట్లో మంచి మంచి వంటకాలు, పిండివంటలు చేయనివ్వడంలేదు. మరి ఇంట్లోవాళ్లేమో చాలాకాలంగా షడ్రుచులకూ బాగా అలవాటు పడి ఉన్నారు. ‘‘మీరు తినడంలేదని అందరినీ మానెయ్యమనడం బాగుందా?’’ అని సీతమ్మ ఒకరోజు లింగరాజును ప్రాధేయపడింది.