ఇప్పుడు పేపర్లలో పరిశోధనాఫలితాల పేరుతో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఒక పరిశోధనలో కనుగొన్న విషయం, కొన్నాళ్ళకు తప్పు అని తేలుతుంది. పరిశోధనలపేరుతో పాఠకుల్ని తికమకపెట్టే ఫలితాలు ప్రకటిస్తూ, ప్రజల్ని చిత్తచాంచల్యానికి గురిచేస్తున్నారు. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ఈ కథలో ఉపేంద్ర కూడా అలాంటి మానసికస్థితికే గురై తన ఇంట్లోనే తనొక కమెడియన్గా మారిపోయాడు. అదెలాగంటే....
నన్ను చూసేసరికి కొంప మునిగిపోయిందన్నట్లు బావురుమన్నాడు ఉపేంద్ర.జరగగూడని ఘోరమేదో జరిగిందనుకుని నేనూ కంగారు పడ్డాను.నా ముఖంలో కలవరం చూసి నాకు అసలు విషయం తెలిసిందనుకున్నాడేమో! దేబెముఖం పెట్టాడు.
‘అయితే నా ఊహ నిజమేనన్నమాట...’ అని మనసులో వగచుకుంటూ, వచ్చే దుఃఖాన్ని అణచుకుంటూ ఆవేదన శృతి కాస్తా పెంచాను.నా శృతికి తన మౌన రోదన రంగరించి కంట తడిపెట్టాడు ఉపేంద్ర. ‘ఇది మామూలు విషయం కాదు కాబోలు..’ అని నేను మరింత ఢీలా పడిపోయాను.ఎవరి నోటివెంటా మాట పెగలడం లేదు.మా ఇరువురి పరిస్థితి అంతర్ర్భమణ ఛాయాచిత్రపేటికలో (Closed circuit camera) చూసినట్లు ఉపేంద్ర సతీమణి సత్యవతి వంటింట్లో నుండి రివ్వున వచ్చి మా ముందు వాలింది. ఆమె చేతిలోని గరిటె కోపంగా పొగలు గక్కుతోంది. దానికి తగిన రీతిలో ముఖకవళికలు జొప్పించి,‘‘ఏమయ్యిందన్నయ్యా...’’ అని నా వంక చూస్తూ అడిగింది.‘నాకు మాత్రం ఏం తెలుసు...!’ అన్నట్లుగా పెదవుల్ని అర్థచంద్రకారంగా మలిచి, అర చేతులను విచ్చిన కమలంలా తిప్పాను.
‘నీకు తెలియనప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకురా...’ అన్నట్లు ఉపేంద్రా నా వంక ఉరిమిచూస్తూ, ఆనాటి దినపత్రిక మా ముందు గిరాటేశాడు.కనిపించే పేజీలోని వార్త రెడ్స్కెచ్ పెన్నుతో సున్నాచుట్టి ఉంది. అది ఉపేంద్ర చేతివాటమనడానికి నిదర్శనంగా, పెన్ను అతడి చేతిలో ఇంకా గన్నులా నాట్యం చేస్తూనే ఉంది.వార్త చదివాను. నాకేమీ బోధపడలేదు.కాని సత్యవతి వార్త చదివి భళ్ళున నవ్వింది. నిండు కుండ క్రిందపడి బ్రద్దలైనట్లుగా, ఈ మారు ఉపేంద్ర దేబెముఖం నాకు బదిలీ అయ్యింది.నాముఖంచూస్తూ నవ్వును మరో నాలుగు లిప్తకాలాలు కొనసాగించి, ‘‘మీరీమధ్య రాక చాలాకాలమైందికదూ అన్నయ్యా! మీకు ఈ విషయాలేవీ తెలియవు. చెబుతానుండండి, ఈయనగారు ఇరుగుపొరుగువారినీ, ఇంటికి వచ్చినవారినీ, ఇంటిల్లిపాదినీ వేపుకుతిన్న విషయం చెబుతాను. వంటపని పూర్తికావస్తోంది’’ అనుకుంటూ సత్యవతి తిరిగి వంటింట్లోకి పరుగుతీసింది.