‘‘తాతయ్యా! రేపు రాత్రి సరిగ్గా 11 గంటల 48 నిముషాలకి నా పెళ్ళి! నువ్వు అమ్మనీ, నాన్ననీ ఎలాగైనా ఒప్పించి, రేపటికల్లా ఇక్కడికి వచ్చేయమని చెప్పాలి! తప్పకుండా రమ్మనిచెప్పు!’’ ఆఫీసుకు వెళ్ళడానికి తొందరపడుతూ చెప్పింది సురేఖ!ఆ మాటలకి నెత్తిమీద పిడుగుపడినట్లయింది ప్రకాశరావుగారికి! నిశ్చేష్టుడై కొయ్యబొమ్మలా నిలబడిపోయాడు! బామ్మ కామాక్షమ్మా స్థాణువులా నిలబడిపోయింది. ఐదు నిమిషాలు మౌనం తర్వాత నెమ్మదిగా తేరుకుని బామ్మ అడిగింది.

ఏమిటే ఈ నిర్ణయం? పెళ్ళంటే బొమ్మలాటనుకున్నావా? ఆడపిల్లవై ఉండీ, ఇంట్లో ఎవరికీచెప్పకుండా, నిన్ను పెళ్ళాడేవాడెవడో కనీసం మాకుచెప్పకుండా...! ఏమిటే ఇంత బరితెగింపు? అసలు నీకు బుద్ధుందా? పెద్దవాళ్ళెవరూ లేరనుకున్నావా? ఎవరినీ అడగకుండా పెళ్ళి ముహూర్తంకూడా పెట్టేసుకోవడమే?’’‘‘బామ్మా! నీ పాతకాలం పద్ధతులు పాటించడానికి ఇక్కడ ఎవరికీ ఓపికా, తీరికాలేవు. అయినా, ఇవన్నీ వివరిస్తూ కూర్చోడానికి నాకు టైమ్‌లేదు. నేను ఆఫీసుకు వెళ్ళాలి! రేపు మీరు పెళ్ళికివస్తే అన్నీ మీకే తెలుస్తాయి. అర్థమవుతాయి’’.‘‘అది కాదే...’’ బామ్మగారు గుడ్లనీరు కక్కుతుంటే ప్రకాశరావుగారు మౌనంగా ఆమెను ఇక ఆగమన్నట్టుగా వారించారు.‘‘మనం దానికి ఏమీ చెప్పనవసరంలేదు.

అది తన బాగోగులు తనే చూసుకునే స్థాయికి ఎదిగింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ పాసైంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో ప్రవేశించింది! మనం ఎంత మొత్తుకున్నా అది తన నిర్ణయం మార్చుకోదు. వాదించడం అనవసరం!’’‘‘అలాగని... దాన్ని మనం గాలికి వదిలేస్తామా! అన్ని విషయాలూ తెలుసుకోవద్దూ?’’బామ్మ చాదస్తానికి సురేఖ నవ్వుకుంది.‘‘బామ్మా! డిస్కషన్స్‌ అనవసరం! రేపు రాత్రి పెళ్ళయ్యాక అన్నీ తీరుబడిగా మాట్లాడుకుందాం! సాయంత్రం వచ్చేటప్పుడు నీకు పట్టుచీరా, తాతయ్యకు కొత్తపొందూరుపంచె, లాల్చీ తెస్తాను. పెళ్ళి టైముకి ముస్తాబై రెడీగా ఉండండి!’’