ప్రేమైకజీవనం, శ్రమైకజీవనం ఈ రెండూ మనిషికి జీవంపోసేవే. ఇందులో ప్రేమ భావన మనిషికి జీవనశక్తినీ, మనోశక్తినీ ప్రసాదిస్తుంది. అందులో తప్పొప్పులుండవు. జీవిమనుగడకు ప్రకృతి ఇచ్చిన వరం ప్రేమ. ప్రేమించడం నేరం కాదు. దాన్ని నేరంగా పరిగణించడమే నేరం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు హృదయాలు కలిస్తేనే ప్రేమ. కానీ ఈ కథలో జానకి ఏం చేసిందంటే....

తడి వెంట్రుకలు తుడుచుకుని ఆరబెట్టుకుంటూ ప్రక్కింట్లోకి చూసింది జానకి.పువ్వులతో ఏదో డిజైన్‌ వేస్తున్నాడు ఆనంద్‌. మురిపెంగా అతడినే చూస్తూ నవ్వుకుంటోంది జానకి.‘మహానుభావుడు! తలెత్తి చూడడే!’ చేతులతో చప్పుడు చేసింది. సైగలు చేసింది.

ఊఁహు..ప్చ్‌..! ఆమె ప్రయత్నాలన్నీ వృథా!‘తనవైపు చూడడేం. వఠ్ఠి బుద్ధావతారం!’ ముద్దుగా తిట్టుకుంది జానకి.‘ఎదురుగా ఇంద్రధనుస్సులా అందాలు రాశిపోసినట్టుంటే చలనం లేనట్టు నటిస్తాడేం!’నవ్వులపువ్వై పెదవులపై వికసించింది ఆమె ఎదలోని ఆనందం.అంతలోనే అలకపూనింది. మూతి ముడుచుకుంది. మళ్ళీ అటువైపు చూసింది. తన ఎదలోతుల్లోని భావాలకు ప్రతీకగా కుప్పపోసినట్టున్న ఇసుకగుట్టవైపు దీనంగా చూసిందామె. ఏదో ఆలోచన వచ్చిన దానిలా మళ్ళీ కలం, కాగితం తీసుకుని రాయటం ప్రారంభించింది. ఇప్పటికిది ఏడో ఉత్తరం.‘‘ఆనంద్‌, నీ కోసమే, ప్రేమతో...నేను...రాస్తున్న ఈ ఉత్తరం...అంటూ తన హృదయాన్ని ఆవిష్కరించింది జానకి. ఎప్పటిలానే తమ సంకేతస్థలంలో ఇసుకను తవ్వి తన హృదయాన్ని అందులో పదిలంగా ఉంచి మళ్ళీ ఆ ఇసుకతోనే కనిపించకుండా కప్పేసింది. నవ్వుకుంటూ ఇంట్లోకి పరుగుదీసింది జానకి.

************************

అదొక చిన్న పల్లెటూరు.ఆధునికత ప్రవేశించని పచ్చనిపల్లె. స్వతహాగా రైతు కుటుంబాలే అన్నీ. ఆరు ఇళ్ళు మాత్రం వరుసగాకట్టి ఉన్నాయి. తమ్ముడితో కలిసి ఇరుగూపొరుగు జీవితం గడుపుతున్నాడు భాస్కర్రావు. మోతుబరి రైతు మాత్రమేకాదు, ఆ ఊరికి ప్రెసిడెంట్‌ కూడా. మనిషి మహా అహంభావి. అతడి ఏకైక గారాలపట్టి జానకి. ఆమెతల్లి అరుణ. జానకి ఇంటిచుట్టూ ఉన్నవన్నీ దాదాపు దూరపు చుట్టరికాలవారి ఇళ్ళే. ఆ ఇళ్ళంన్నింటిలోనూ పాతకాలపు మండువా ఇంటిని పడగొట్టి ఆధునిక భవంతి కట్టుకుని దర్జా ఒలకబోస్తున్నది భాస్కర్రావు ఒక్కడే. బాబాయి ఇంటికీ, ఆనంద్‌ ఇంటికీ మధ్య ఆ మేడలో చిలుకమ్మలా, పుత్తడిబొమ్మలా ఉంటోంది జానకి.