ఆ నలుగురూ స్నేహితులు.ఆ సిమెంటుబెంచీ మీద కూర్చుని కొన్నాళ్ళుగా ఒకరి కష్టసుఖాల్ని ఒకరికి చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ నాలుగుస్తంభాలాటలా కాలక్షేపం చేస్తుంటారు. ఆ నలుగురిలో వృద్ధాప్యం ఆనవాళ్ళు దోబూచులాడుతుంటాయి. వాళ్ళు వృత్తిరీత్యా వేరేవేరు ప్రాంతాల్లో బ్రతికి చివరాఖరికి పిల్లల దగ్గర చేరినవాళ్ళు. ఎవరి ఇబ్బందులు వాళ్ళవే అయినా ఒకళ్ళకొకళ్ళు ఓదార్పు.

ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఆ బెంచిమీద కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటూ మధ్యమధ్య తమ మిగిలిన ఇద్దరం స్నేహితుల్ని గుర్తుచేసుకున్నారు. అంతలో దూరం నుంచి వస్తూ కనిపించిన తమ నేస్తాన్ని ఇట్టే గుర్తుపట్టారు. చాలా హుషారుగా ఎదురువెళ్ళాలని లేవబోతుండగా దూరంనుంచే ఆయన ఆగమన్నట్టుగా చేయి ఊపాడు. తప్పిపోయిన బిడ్డ దొరికినంత సంతోషం కనిపించింది ఆ ఇద్దరు మిత్రుల్లోనూ.‘‘ఎలా ఉన్నావ్‌ రంగా! అంతా బాగే కదా!’’ రంగారావు చెయ్యి పట్టుకుని ఊపేస్తూ అడిగాడు పద్మనాభం.‘‘మీరెలా ఉన్నారు? ఇద్దరే ఉన్నారు మన మిత్రుడు పావనమూర్తి ఎక్కడ? వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా!’’ కూర్చుంటూ అడిగాడు రంగారావు.‘‘మీరలా వెళ్ళాక చాలానే జరిగాయి రంగా! పాపం పావనమూర్తి..’’ అన్నాడు దిగులుగా సీతారామయ్య.

రంగారావు కంగారు పడ్డాడు.‘‘ఏమైంది పావనమూర్తికి...’’‘‘ముందు మీరు చెప్పండి అలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారేమిటి? పావనమూర్తి మీ కోసం చాలా దిగులు పడ్డాడు..’’ అడిగాడు పద్మనాభం.ఇంట్లో సమస్య. చెప్పుకునేది కాదు. నా కోడలు రమ్య, నాకు నా మనవరాలికీ మధ్య తెరలాంటిది కట్టింది.. చిన్నప్పట్నించే ఆ పిల్లని నేను పెంచాను. వాళ్ళిద్దరూ జాబ్స్‌ అంటూ పొద్దున్నుంచీ హడావిడి పడుతుంటే నా భార్య రమణి వంటగదికి అంకితం అయిపోతే, మనుమరాలు సింధుని ఆడిపాడి నేనే పెంచాను. నా భార్య చనిపోయాక సింధునే నాకు ఆలంబన అయ్యింది.

ప్రతిచిన్న విషయం షేర్‌ చేసుకునేవాళ్ళం. ఏమైందో తెలీదు. సింధు నాకు సన్నిహితంగా ఉంటే రమ్య చాలా భయపడేది. మా ఇద్దర్నీ దూరం జరపాలని చూసేది. అలా చూసేకొద్దీ మామధ్య బంధం మరింత బలంగా అల్లుకుపోతోంది. ఇక సింధుని ఏమీ అనలేక నన్ను ఏదో ఒకవిధంగా విమర్శిస్తూ సాధించేది. మధ్యలో నా కొడుకు రాజేంద్ర నలిగిపోయేవాడు. చివరికి ఒకరోజు నాకు సింధుని..చెప్పలేను నా భార్యస్థానంలో...’’ అంటుంటే కళ్ళలో నీళ్ళు అవమానంతో తుళ్ళిపడ్డాయి.