ఒకప్పుడు చందనపురమనే ఊళ్లో రామానందుడనే గృహస్థు ఉండేవాడు.ఆయన ఒక్కగానొక్క కూతురు రోహిణికి నాలుగేళ్లప్పుడు భార్య పోతే, ఆయన సత్యవతి అనే యువతిని మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. సత్యవతికి రోహిణి అంటే గిట్టేది కాదు. చిన్నతనం నుంచీ కష్టమైన పనులు చెబుతూ రోహిణిని నానా హింసలూ పెట్టేది.

రోహిణి అమాయకురాలు. ఓర్పు ఎక్కువ. సవతి తల్లి ఎన్ని పనులు చెప్పినా విసుక్కోకుండా చేసేది. ఎన్ని తిట్టినా బదులివ్వకుండా సహించేది. ఆమె మంచితనం గురించి ఊళ్లో గొప్పగా చెప్పుకునేవారు.క్రమంగా రోహిణి యుక్తవయస్కురాలై ఎంతో అందంగా తయారైంది.ఒకసారి రామానందుడు సకుంటుంబంగా పొరుగూర్లో పెళ్ళికి వెళ్లాడు. పెళ్లిలో చంద్రశేఖరుడనే యువకుడు రోహిణిని చూశాడు. అతడికి ఆమెపై ప్రేమ పుట్టింది. ఆమె ఎవరో ఆరా తీసి రామానందుణ్ణి కలుసుకుని తన మనోభీష్టం చెప్పాడు. అప్పుడు సత్యవతి రామానందుడి పక్కనే ఉంది. ఆమె చంద్రశేఖరుడి వివరాలడిగి తెలుసుకుని, ‘‘మా రోహిణి అందాల భరిణ. ఎండ కన్నెరక్కుండా పెంచాం. అలా చూసుకోగలవాడికే ఇచ్చి పెళ్ళి చేస్తాం’’ అంది.

‘‘మీకులా మాత్రమే కాదు. నేను మీ అమ్మాయిని మీకంటే చాలా బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను’’ అన్నాడు చంద్రశేఖరుడు వెంటనే.‘‘వట్టి మాటలొద్దు. ముందు లక్ష వరహాలు తెచ్చివ్వు. ఆ తర్వాతే నీకూ, రోహిణికీ పెళ్ళి’’ అంది సత్యవతి నిరసనగా. చంద్రశేఖరుడు చలించలేదు. ‘‘లక్ష వరహాలు సంపాదించడం నాకేం కష్టం కాదు. ఏడాది గడువు చాలు. అన్న డబ్బు తెచ్చి మీకివ్వడమేకాదు. ఓ పెద్ద మేడకట్టి, అందులో దాసదాసీ జనాన్నుంచి, అప్పుడే రోహిణిని పెళ్ళాడుతాను. అంతవరకూ ఇంకెవరితోనూ రోహిణి పెళ్ళి జరిపించకూడదు’’ అన్నాడు. సత్యవతి బదులివ్వకుండా, నవ్వి ఊరుకుంది.