ఆ పెద్ద మనిషి కి పుస్తకాల పిచ్చి . ఏనాటివో ఆరవై డెబ్భైఏళ్ళనాటి మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటాడు.. మంచి సాహిత్యం దొరికితే వదిలిపెట్టడు . కానీ అతడికో దుర్గుణం ఉంది. లైబ్రరీ చందాదారుడుగా తీసుకెళ్ళిన పుస్తకం పోయిందని అబద్ధం చెప్పి డబ్బులు కట్టేస్తుంటాడు . ఎందుకంటే అవన్నీ అమూల్యమైనవి మరి ! కానీ ఆ పెద్దమనిషి అదొక దుర్గుణం అనుకోవడంలేదు! అతడు ఆ అలవాటు మానుకున్నాడా?లేదా?

‘‘నిజంగా సార్‌! ఆ పుస్తకం పోయినందుకు నాకే ఎంతోబాధగా ఉంది!ఏంచేస్తాం! ఏదో మంచిపుస్తకం నలుగురితో చదివిద్దామనే మంచిఉద్దేశంతో ఇస్తే, ఎదుటివాళ్ళు దానివిలువ తెలుసుకోకుండా పోగొడ్తారు!’’ లైబ్రేరియన్‌ఎదుట దోషిలా నిలబడి, ఎంతో అణకువగా అన్నాను.‘‘నిజమే మీరంటున్నది. కానీ, అది చాలా పాతపుస్తకమండీ! మళ్ళీ లైబ్రరీవాళ్ళు కొందామన్నా దొరకదుగదా! అలాంటివాటిని కొంతజాగ్రత్తగా ఉంచాలికదా! ఇలాంటి పుస్తకాలన్నీపోతే ఇంకా మా లైబ్రరీలో ఏం మిగుల్తాయి!’’‘‘లేదండీ! ఈసారి జాగ్రత్తపడతాను’’ అని నచ్చచెప్పాను.లైబ్రేరియన్‌ బీరువాలోంచి ఓ పాత రిజిష్టర్‌ దుమ్ముదులిపి, అందులో నా కార్డులో ఉన్న పుస్తకం నెంబరుతో వెతికి, ఆ పుస్తకంధర ఓ పేపరుమీద వేశాడు. అప్పటిధర ఒక రూపాయి, నాలుగణాలు.

అది చెన్నపట్నంలోని వావిళ్ళరామశాస్త్రులు అండ్‌ సన్స్‌ వారు 1938లో ప్రచురించిన ‘సాక్షి’ వ్యాససంపుటి. పానుగంటివారిని ఆ చివరినుండి ఈ చివరిదాకా ఎన్నోసార్లుచదివేసి, ఆయన పుస్తకాలపాతప్రింట్లు నా లైబ్రరీలో అపురూపంగా భద్రపరుచుకుంటున్నాను.‘‘సార్‌! ఒక రూపాయి, నాలుగణాలు ఉంది!’’‘‘ఫర్వాలేదు సార్‌! ఈ వంద రూపాయలుంచండి!’’‘‘సారీ సార్‌! మీరు రెండురూపాయలిస్తే చాలు! నేను జమకట్టుకుని మీకు రసీదు ఇచ్చేస్తాను’’లైబ్రేరియన్‌ను ఆశపెట్టబోయి భంగపడ్డాను. నిజానికి ఆ పుస్తకం ఎక్కడికీపోలేదు. నావద్దనే భద్రంగా ఉంది. ఈ పుస్తకం మళ్ళీ దొరకదనే భయంతో, ఇలాంటి పుస్తకం ఇప్పుడు చదివే వాళ్ళులేకపోవడంవల్ల లైబ్రరీలోనే చెదలు పట్టేస్తుందన్న ఉద్దేశంతో, పోయిందని అబద్ధంచెప్పి డబ్బులు కట్టేశాను. నాకు ఇదేం కొత్తకాదు. ఇదేపద్ధతిలో ఇలాంటి పుస్తకాలు ఎన్నో సేకరించి పెట్టుకున్నాను. ఇవన్నీ చదివినప్పుడల్లా కొత్తగా అర్థమవుతున్నందున వాటిపై నాకు మోజు మరింత పెరుగుతోంది!