‘‘ఈ శిథిలాల రంగులు నీకు బాగా పట్టుబడ్డాయి. ఆ రంగు నువ్వు అంత కచ్చితంగా కాన్వాస్‌ మీదికి ఎలా తీసుకువచ్చావో, ఏం మిక్స్‌ చేశావో తెలీదు కాని! ప్రతి పెయింటింగ్‌ లోనూ వాటికి కాంట్రాస్ట్‌గా కొట్టొచ్చినట్టు వుండే రంగు దేహాల స్త్రీలు ... వొక మబ్బు ... అలా నాకు తెలిసీ, పదేళ్లుగా ఇదే కదా నీ కాన్వాస్‌!’’

కాన్వాస్‌ లోపలికి ఇంకోసారి తీక్షణంగా చూస్తూ అందామె.ఆ టైం లైన్‌ తన కంటే ఆమెకే బాగా తెలుసు. పదేళ్ళ కిందటే కదా, నాన్న పోయాక వూళ్ళో తమకేమీ లేదు అనిపించింది. తప్పనిసరైన వుద్యోగం మిష మీద హైదరాబాద్‌ తనని పిలిచి మరీ రప్పించుకుంది, అమ్మతో సహా -ఈ నగరాన్ని ప్రేమించాలని చాలా సార్లు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడే కచ్చితంగా ద్వేషించడానికి కావలసిందేదో వెంటనే డ్రమాటిక్‌గా సృష్టించేస్తుందీ హైదరాబాద్‌.కొంత కుదురుకుంటున్నాడన్న భరోసా మొదలైందో లేదో అమ్మని మింగేసింది నగరం.తన అశక్తతని నగరానికి ఆపాదిస్తున్నాడా?! ఏమో! కారణాలు ఎప్పుడూ తవ్వి తీయలేదు. ఇంతకుముందు కంటే బతుకు భయం పెరిగిపోయిందన్నది నిజం. తన అశక్తత కూడా నిజమే. 

తనకి బాగా తెలిసిన నిజం. అడుగు ముందుకు వేయాలంటే బతుకు అంతా చెదిరిపోతుందేమో అన్న బెదురు. ఆమెతో ప్రేమా, పెళ్ళీ అవీ అంతే కదా! కొన్ని విఫలమైన అడుగులు. వుద్యోగం మీదా పెద్ద నమ్మకం లేదు. వచ్చే క్షణం ఏమిటో తెలియని అనిశ్చితి. ఈ క్షణంలో బతకలేని అస్థిమితత్వం.‘‘ఎందుకురా అంత బెదురు ప్రతిదానికీ! వూళ్ళో వున్నప్పుడు ఇంత బెదురు లేదు కదా నీలో!’’ అనేది అమ్మ. సమాధానం లేదు తన దగ్గర. కానీ, అమ్మకి తెలుసేమో, తన లోపల తానేమిటో -‘‘ఈ శిథిలాల కింద నువ్వేదో దాస్తున్నావ్‌?’’అప్పటికి బహుశా నాలుగో సారి ఆ కాన్వాస్‌ లోకి తొంగి చూస్తూ అంది ఆమె.ఎంత దూరంలో నిలబడితే పెయింటింగ్‌ ఎంత దగ్గరగా కనిపిస్తుందో ఆమెకి తెలుసు. అలా నిలబడ్డప్పుడు ఆమె పెయింటింగ్‌లో ఒక భాగమైపోయినట్టే కనిపిస్తుంది. ఆ పెయింటింగ్‌లో తను మరచిపోయిన వయొలెట్‌ పువ్వేదో అప్పటికప్పుడు కాన్వాస్‌ మీద పూసినట్టుగా అనిపిస్తుంది.