ఇది వరకు ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యా దీవించు, అమ్మమ్మా దీవించు అని అడిగిమరీ ఆశీర్వాదాలు పొందేవాళ్ళు. నీకు జయం కలుగుతుందిరా అని వాళ్ళు దీవిస్తే కొండంతబలంలో ఆ పని దిగ్విజయంగా పూర్తిచేసేవాళ్ళు. కానీ ఈ కథలో మాత్రం అతడికి ఒక శఖునిపక్షి కీడు హెచ్చరికలే చేసేది. అది విని అతడు డీలా పడిపోయాడా? లేక ఆత్మవిశ్వాసంతో ఆ మూఢత్వాన్ని పక్కకు నెట్టి విజేతగా నిలిచాడా?

****************************

సిమ్లా నుండి ఢిల్లీ వెళ్ళే వోల్వో బస్సులో నాకు కేటాయించిన సీటులో కూర్చున్నాను. నేను చదివిన ఎం.బి.ఎ పుణ్యమా అని ఎక్కడ ఏ మేనేజ్‌మెంట్‌ సూత్రాన్ని వాడాలో నాకు కరెక్ట్‌గా తెలుసునని గట్టిగా నమ్ముతాను. ఎంత గట్టిగా అంటే, ఎమ్మారై చేసుకున్నప్పుడు చెవులు మూసుకోనంత. అందుకే జస్ట్‌ నా సివిల్స్‌ పరీక్షకి వారంరోజులున్నాయనగా ఈ హిమాచల్‌ప్రదేశ్‌ హాలిడే పెట్టాను. అలా ఏదో ఒకటి చెయ్యడం నాకు సెంటిమెంటు. ఎప్పుడూ మొదటిర్యాంక్‌లో పాసైన నేను పరీక్షలు మొదలయ్యే ముందు మనసు మళ్ళించుకునేవాణ్ణి. అప్పుడప్పుడు ఇష్టంగా, అప్పుడప్పుడు కాకతాళీయంగా! నా పదో క్లాస్‌ పరీక్షలు మొదలయ్యే ముందురోజు రిలాక్స్‌ అవడానికి ‘ఆకాశమంత’ సినిమా చూశాను. ఇంటర్మీడియట్‌ పరీక్షల ముందురోజు పక్కవాళ్ళమ్మాయి వసంతక్కపెళ్ళికి రాత్రింబవళ్ళు సాయం చేశాను. అలాగే ఐఐటీలో చదివేటప్పుడు పరీక్షల ముందు చేపాక్‌ స్టేడియంలో ఐ.పీ.ఎల్‌ ఆటలుచూసి, ఇప్పుడు చెడ్డపేరు తెచ్చుకున్న ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ జట్టుని తెగ సపోర్ట్‌ చేసేవాణ్ణి. వాళ్ళ ‘ఓ’నరుడి అళియుడు బెట్టింగ్‌ బంగార్రాజులతో చేతులు కలిపారని నాకప్పుడు తెలియదుకదా!

బెంగుళూరు ఐ.ఐ.ఎంలో చదివేటప్పుడుమాత్రం రాయల్‌ ఛాలెంజర్స్‌ జోలికిపోలేదు. లేకపోతే, అప్పులెగగొట్టి పారిపోయిన విజయమాల్యా టీమ్‌ని సపోర్ట్‌చేసిన పాపానికి ఇప్పుడు బాధ పడుండేవాణ్ణి! పరీక్షలముందర బిలియర్డ్స్‌, స్నూకర్‌ లాంటి ఆటలు ఆడేవాణ్ణి. ఇప్పుడు మాత్రం జీవితంలో అతి క్లిష్టమైన పరీక్ష వ్రాస్తున్నాను గనుక జీవితాంతం గుర్తుండిపోయే హాలిడే ట్రిప్‌కి వెళ్ళి రావాలని నిశ్చయించాను. ముందరే మా కుటుంబసభ్యులకి శివాలిక్‌ ఎక్స్‌ప్రెస్‌లో సిమ్లా నుండి కాల్కా వరకు, అక్కడి నుండి ఢిల్లీ వరకూ రాత్రి రైల్లోను, ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వరకూ విమానంలోను టిక్కెట్లు కొనేశాను. ముందుగా ప్లాన్‌ చెయ్యడంవల్ల విమానంలో కారుచౌకగా టికెట్లు లభించాయి. నాకు రెండువేల ఏడొందల రూపాయలు ఖర్చైతే, మా అమ్మా నాన్నలకి, చెల్లికీ చెరి రెండువేల మూడొందల రూపాయలే ఖర్చయ్యింది. ఆ మాటకొస్తే, ఢిల్లీకి వెళ్ళే ఈ బస్సుకికూడా పెద్ద ఎక్కువ ఖర్చుపెట్టలేదు నేను. ఇలాంటి వాటిల్లో నేను ‘అడ్వాన్సు ఫ్లానింగ్‌’ అనే సూత్రం వాడతాను.

పరీక్ష ముందు వారంరోజులు సిమ్లాలో గడపడం ‘జస్ట్‌ ఇన్‌ టైం’ సూత్రానికి నిదర్శనం. సిమ్లా ట్రిప్‌ అంతా సజావుగా సాగిపోయింది. ఇప్పుడు నేను ఎక్కిన బస్సు నన్ను శనివారం పొద్దున్న ఆరున్నరకి ఢిల్లీలో దింపుతుంది. కాశ్మీరీగేటు బస్సుస్టాండ్‌నుంచి విమానాశ్రయానికి మెట్రోలో ముప్ఫైమూడు నిముషాలు. వెంటనే చెక్‌ ఇన్‌ చేస్తే, తొమ్మిదిన్నరకి హైదరాబాద్‌వెళ్ళే విమానం బయల్దేరి పదకొండూనలభైకి దింపుతుంది. అక్కడి నుండి ఖైరతాబాద్‌కి బస్సులో మహా అయితే గంటన్నర. ఎంత లేదన్నా భోజనం వేళకి ఇల్లు చేరి, పక్క ఫ్లాట్లో ఉంటున్న మా పిన్ని ఇంట్లో భోంచేసెయ్యచ్చు. ఆ తరువాత కొంచెం రెస్ట్‌, మరికొంత చదువు, ఆదివారంనాడు సివిల్స్‌ పరీక్ష బ్రహ్మాండంగా రాసెయ్యచ్చు.