ఎవరో గట్టిగా తన్నినట్టు అనిపిస్తే నిద్రలాంటి అపస్మారక స్థితి నుంచి ఈ లోకంలోకి వచ్చాడు హరీష్. అతికష్టంమీద కళ్ళు తెరవగలిగాడు. కలో నిజమో తెలియడం లేదు. తను కళ్ళు తెరవగలిగాడో లేదో కూడా తెలియదు. చుట్టూ అంధకారం. పైకి చూస్తే చెట్లు దయ్యాల్లా నిలబడి ఉన్నాయి. పక్కనే వరదనీటి శబ్దం అంతా నిజమే అని చెబుతోంది. తను బురదలో పడిపోయినట్టు నెమ్మదిగా అవగతమవుతోంది.
ఈసారి గట్టిగా కుదుపు, ‘‘‘బాబూ... లే’’ అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు హరీష్. పక్కనే ఒక వ్యక్తి కూర్చుని తనపైకి వంగి చూస్తున్నాడు.‘తను ఎక్కడ ఉన్నాడు? అతనెవరు? అసలేం జరిగింది?’ప్రశ్నలు హరీష్ మెదడును పూర్తిగా చేతనస్థితిలోకి తీసుకువస్తూంటే నెమ్మదిగా జరిగిందేమిటో అతడికి గుర్తుకువస్తోంది.బస్సు జగదల్‌పూర్ నుంచి రాత్రి ఎనిమిదిన్నరగంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరింది. ప్రైవేట్ మైన్స్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హరీష్ భోజనంచేసి బస్సు ఎక్కాడు. దసరాపండుగ జరుపుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళుతున్నాడు. అతనిపెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదో కారణం.మూడురోజులుగా తుఫాను. సన్నగా వర్షం కురుస్తోంది.
వానలో ఉదయంనుంచి మైన్స్‌సైట్‌లో తిరగడంతో అలసిపోయిన హరీష్‌కు వెంటనే నిద్రపట్టేసింది. ఎంతసేపు అలా పడుకున్నాడో తెలియదు. బస్సు కుదుపుతో ఆగిపోవడంతో మెలకువ వచ్చింది. తలెత్తి చూశాడు. నలుగురైదుగురు ప్రయాణికులు సీట్లలోంచి లేచి నిలుచుని ఆసక్తిగా చూస్తున్నారు.ఎదురుగా బస్సు లైటు వెలుగులో రోడ్డుకు అడ్డంగా పడుకున్న చిరుత కనిపించింది. మూడు చిరుత పిల్లలు దానిపైకి ఎక్కి దిగుతూ ఆడుతున్నాయి. అంతా కారడవి. ప్రమాదకరమైన ప్రాంతం. ఏడాదిలోనే హరీష్‌కు దండకారణ్యప్రాంతం గురించి అవగాహన వచ్చింది. ఒకటి రెండుసార్లు తనూ జీపులో వెళుతున్నప్పుడు ఇలా చిరుతలు తారసపడ్డాయి.