‘‘నేను వీణ వాయించడం మానేశానని తెలిస్తే మా పిచ్చినాన్న ఎంత బాధపడిపోయేవాడోపాపం. అదృష్టవంతుడు. నేను బాగా కచేరీలు చేసే రోజుల్లోనే పోయాడు’’ అంది గాయత్రి. ఎదురుగా కూర్చుని టీ తాగుతున్న భార్గవితో.‘‘మీ నాన్న మాటెలా ఉన్నా నాకు చాలా బాధగా ఉందే. ఈ టైముకి రోజు చక్కగా సాధన చేసేదానివి’’ అంది భార్గవి.
‘‘ఏమిటోనే, పిడికిలి మూసి తెరవడం కష్టంగా ఉంటోంది. చూపించని డాక్టర్ లేడు. అందుకే, వీణ అమ్మేద్దామని పేపర్లో యాడ్ ఇచ్చాను’’ అంది గాయత్రి. దానికి భార్గవి తెల్లబోతూ ‘‘ఏమిటి? వీణ అమ్మేస్తావా? మతేమైనా పోయిందా నీకు? ఐనా అది మీ నాన్నకి ఆరోప్రాణం అనేదానివే కదే’’ అంది. గాయత్రి తలూపుతూ, ‘‘ఆ మాట నిజమనేగానీ సెంటిమెంట్ కోసం అంతమంచి వీణని ఇంట్లో పెట్టుకోడంకన్నా కష్టపడి సాధనచేసి ఆ వీణని ప్రాణంలా చూసుకునేవాళ్లకి ఇవ్వగలిగితే అంతకన్నా కావలసిందేముంటుంది చెప్పు’’ అంది. ఇంతలో డ్రైవర్ ధర్మరాజు వచ్చి, ‘‘అమ్మా ఎవరో వీణకోసం వచ్చారమ్మా’’ అన్నాడు.
గాయత్రి నవ్వుతూ కస్టమర్లు వచ్చేస్తున్నారోయ్’’ అని భార్గవితో అంటూ, ‘రమ్మను’ అంది డ్రైవర్‌తో.ఒక నలభైఏళ్ల తండ్రి, ఆయన వెనకే పుత్తడి బొమ్మలా ఓ పదేళ్ళ పిల్ల వచ్చింది. పిల్ల తండ్రి, గాయత్రిని చూసి ఆశ్చర్యపోతూ ‘‘నమస్కారం అండీ ఇది మీ ఇల్లా? అనుకోకుండా ఇలా మిమ్మల్ని కలవాల్సి వస్తుందనిస్తుందని అస్సలు ఊహించలేదండి. అమ్మలూ ఆవిడ ఎవరో తెలుసా’’ అంటే ఆ పిల్ల తండ్రితో రహస్యంగా ‘‘వీణాపాణీ విదూషి గాయత్రిగారు’’ అంది. దానికి గాయత్రి, భార్గవి కూడా నవ్వుకున్నారు. ‘‘నా పేరు కృష్ణారావండీ. ఇది మా అమ్మాయి నీరజ. పేపర్లో యాడ్ చూసి వచ్చాను’’ అన్నాడు ఆ వచ్చిన తండ్రి.