మీటింగ్‌లో ఉన్న కారుణ్య లంచ్ బ్రేక్‌లో ఎస్.ఎం.ఎస్ చూసుకుని అదిరిపడ్డాడు. అది చాలా ముఖ్యమైన, అంతర్జాతీయ ప్రముఖులతో పెట్టిన మీటింగ్ కానట్టయితే మధ్యలోనే వదిలేసి పరిగెత్తి ఉండేవాడు. మీటింగ్ ఎలా పూర్తి చేసాడో, ఆ పైవాడికే తెలియాలి. అయీ అవంగానే తను ఒక ముఖ్యమైన సొంత పనిమీద వెళ్ళాల్సి ఉందనీ, అన్యధా భావించకుండా అందరినీ డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, తన పి.ఏ. తన తరఫున అక్కడ అటెండ్ అవుతాడనీ, తనని మన్నించమని కోరుతూ... ఒక్క పరుగులో కారు చేరుకున్నాడు కారుణ్య. ఏమైంది ఈ లావణ్యకి.. అర్థం పర్థంలేని ఈ మెసేజ్ ఏమిటి?
అతని కళ్లు మరోసారి తన మొబైల్‌లో మెసేజ్ మీదకి పరుగుతీసాయి. అప్పటికీ అది ఎన్నోసారో లెక్కేలేదు. ‘గుడ్ బై కారుణ్యా... నన్ను మన్నించు మన ఇద్దరి జీవితాలు కలవవు. నేను జాబ్ రిజైన్ చేసి ఈవెనింగ్ ఫ్లైట్‌కి ఇండియా వెళ్ళిపోతున్నాను.. సెలవు’.ఏమైంది ఈ లావణ్యకి.. రెండు రోజుల క్రితమేగా కలుసుకుని తాము కలిసి జీవించబోయే భావి జీవితం గురించి, కలిసి చేయబోయే ప్రాజెక్ట్ గురించి... ఎంతో సంతోషంగా చర్చించుకున్నది, ఇంతలో ఏమైంది? ఈ రెండు రోజులుగా తలమునకలయ్యే పనితో తనకు మాట్లాడటమే కుదరలేదు. లావణ్య తెలివైనదే కాదు, మంచి అవగాహనా, ప్లానింగ్, ధైర్యం అన్నీ ఉన్న ఈ తరం అమ్మాయి, కనీసం కారణం కూడా చెప్పకుండా, తనతో చెప్పాపెట్టకుండా ఇలా ఎలా చేస్తుంది? కారణం ఏమై ఉంటుంది?’ అన్నీ ప్రశ్నలే.. కారుణ్య బుర్ర పనిచెయ్యడం లేదు, అలవాటైన డ్రైవ్ యాంత్రికంగా జరిగిపోతుంది.. వాచ్ చూసుకున్నాడు.
ఇంకా పదే పదినిమిషాల్లో ఫైట్ టేకాఫ్ అయిపోతుంది.. ఎంత స్పీడ్‌గా వెళ్ళినా మినిమం అరగంటకు తక్కువ పట్టదు.. దేవుడా... ఏదైనా అద్భుతం జరిగి ఫ్లైట్ లేట్ అయితే బాగుండనుఉన... బిగించి లాగి విడిచిన బాణంలా పరిగెడుతోంది అతని కారు.. అతని మనసు అంతకంటే వేగంగా....ఉన్నట్టుండి వచ్చింది ఓ ఆలోచన.. వెంటనే ఏయిర్‌పోర్ట్‌కి ఫోన్ చేసాడు.. ఇండియా వెళ్ళే ఫ్లైట్‌లో బాంబ్ పెట్టారు. అతనికి తెలుసు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఆ దేశంలో ఆ ఫేక్ కాల్ కనిపెట్టి తనని పట్టుకోవడం పెద్ద పనేం కాదు. కానీ ఆ ఫ్లైట్ బయలుదేరడం ఆలస్యమవుతుంది. ఆ సమయం చాలు తను లావణ్యని పట్టుకోడానికి... ఆలోచనల మధ్యే కారు గమ్యం చేరుకుంది.