‘‘తాం... తాం... తాం... తకఝనుత.... తకిట తాం...’’ప్లేయర్‌లో పాట. గ్రీన్‌రూమ్‌లో జాహ్నవి.‘‘ధీం... తకిట... ధీం... ధీం... ధీం...’’సౌండ్ పెరిగింది. చేతులూ, కనులూ లయబద్ధంగా కదులుతున్నాయి. ‘‘బాబూ, సౌండ్ కాస్త తగ్గించవూ’’ అభినయానికి జాహ్నవి రెడీ అవుతోంది.
తకఝనుత... తకిట తాం... తాం...విప్పారిన కనురెప్పలకు అంటిన కాటుక సరిచేసుకుంటోంది, అద్దంలోకి చూసుకుంటూ... ‘‘మధురం... హసితం... మధురం’’ పాట సాగుతోంది. ఆ పాటతోపాటే ఆమె ఆలోచనలూ వెనక్కి పరిగెట్టాయి.జాహ్నవిని వాళ్ళమ్మ నాలుగేళ్ళక్రితం తంజావూరుకు తీసుకెళ్ళింది. అక్కడ ముఖ్యంగా, చోళుల కాలం నాటి బృహదీశ్వరాలయం చూపించింది. వెయ్యేళ్ళ పురాతనమైన ఆలయం అది. దాన్ని కట్టించినవాడు రాజరాజచోళుడు. క్రీ.శ. 1010లో పూర్తిచేశారట. 216 అడుగుల ఎత్తైన గోపురం. అక్కడ శిల్పాలలో వివిధ నాట్యభంగిమలు చూసిన వెంటనే జాహ్నవి, ‘‘అమ్మా, నేను డాన్స్ నేర్చుకుంటానే...’’ అన్నది. అమ్మ ‘‘వద్దు’’ అంది.‘‘ఏం?’’ అంది పిల్ల, భ్రుకుటి ముడుస్తూ. ‘‘వద్దంటే వద్దు’’ అంది తల్లి. తల్లి స్వరంలో ఏదో తెలియని భయం.
ఆమెలోని భయం – ఆమె వదనంలో కనపడుతూనే ఉంది. ఏదో దాస్తోంది. ఇట్టే కనిపెట్టేసింది జాహ్నవి. ‘‘వదనం మధురం... నయనం మధురం.... హసితం మధురం’’ ప్లేయర్‌లో పాట. మళ్ళీ సౌండ్ పెంచారు.జాహ్నవి పాదాలు లయబద్ధంగా కదులుతున్నాయి. భరతనాట్యంలో బాగా ప్రావీణ్యం ఉన్నవాళ్ళే నాలుగు వరసలుగా గజ్జెలు కడతారు. అలా కడితే పాదం కుదుపుకి శబ్దం బాగా రావాలి. కానీ మంద్రస్థాయిలోనే వినబడుతోంది. అదే టెక్నిక్. నాలుగు వరసలు గజ్జెలతో పాదం వేగంగా కదిలినా శబ్దం లయబద్ధంగా తక్కువ స్థాయిలో వచ్చేలా కాలి కదలికల్ని నియత్రించడంలోనే నాట్యకారిణి ప్రతిభ వ్యక్తమయ్యేది. జాహ్నవి ఈరోజు ప్రదర్శనలో విరాట్ రూపం చూపబోతోంది. తను చాలా నిశ్చయంగా ఉంది. నిశ్చింతగా కూడా! అయినా, ఆమె మెదడులో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి.