‘‘ఆ ఇంటిలోనా మనం ఉండాల్సింది’’ అంది జానకమ్మ ఆ డాబా ఇంటిని దూరంనుండి చూస్తూ. ఊరికి దూరంగా కాలనీలో పూరిళ్ళ మధ్య అక్కడక్కడన్న డాబా ఇళ్ళ మధ్యన ఉందా డాబా ఇల్లు.‘‘అవును. ఆ ఇంటిలోనే మనం ఉండాల్సింది’’ అన్నాడు శివరామయ్య.

‘‘ఈ అలగా జనం మధ్యా....’’ ముఖం చిట్లించి జానకమ్మ.‘‘నీవన్న అలాగా జనమెవ్వరూ మనింట్లో ఉండరు. వాళ్ళిళ్ళలో వాళ్ళుంటారు’’‘‘ఇంత జరిగినా మీ చమత్కారం పోలేదు’’.‘‘ఇంతకీ ఇప్పుడేమైందని? వాడికి వాడి కుటుంబానికి ఆ ఇల్లు చాలటంలేదని మనల్ని వేరే ఇల్లు చూసుకోమన్నాడు. ఇలా వచ్చేశాం. ఇందులో తప్పేముంది’’.‘‘వేరే ఇల్లు చూచుకోండి అని వాడనలేదు. కోడలుపిల్ల వాడితో అనిపించింది, అయినా ఇంతకన్నా మంచి ఇల్లు మీకు మరెక్కడా దొరకలేదా?’’‘‘ఇది మంచి ఇల్లే. ఇంతకన్నా మంచి ఇల్లు నా పెన్షన్‌కి సరిపడేది దొరకదు. పద చూద్దువుగానీ’’ అంటూ ఇంటి తలుపులు తీశాడు.ఇంటి ముందు చిన్న ఖాళీ స్థలం.

అది దాటి మెట్లెక్కుతే కాస్త విశాలమైన వరండా, లోపల చిన్నగది, దాటితే పెద్దగది, వంట గది వెనుక. స్నానాల గది, టాయిలెట్‌ గది పొందికగా ఉన్నాయి. చిన్న పెరడు కూడా ఉంది.‘‘బాగుంది’’ అంది కాస్త తృప్తిపడుతూ.‘‘అక్కడలాగా ఇక్కడ పనిమనుషుల కోసం ఇబ్బంది పడక్కరలేదు. పనిపిల్ల గౌరి కుదిరింది. ఇప్పుడే వస్తుంది. బట్టలుతికి ఇస్త్రీ చేసేవాళ్ళున్నారు. పక్కవీధిలో చిన్న పచారి దుకాణం ఉంది, అక్కడ అన్నీ దొరుకుతాయి. రెండు మూడు ఆటోలున్నాయి’’.‘‘అంతా బాగానే ఉంది.గానీ, రాత్రయ్యేసరికి, ఈ ఏరియాలో మగాళ్ళు మందుతాగి తగవులాడుకుంటారట! ఆడ, మగ తేడాలేకుండా జుట్లు,జుట్లు పట్టుకుని కొట్లాడుకుంటారట, మనుషుల్లో శుచి శుభ్రత ఉండవట...’’