ఇప్పటివరకు వంటింట్లో అడుగుపెట్టే అవసరమే రాలేదు ఆమెకు. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బాబును చూసుకోవాలి, భర్తకు అన్నీ రెడీచేసి ఆఫీసుకు పంపాలి. ఒక్కర్తే పనులు చేసుకోలేక సతమతమైపోతోంది ఆమె. ఆ సమయంలో పాతసిన్మా హీరోయిన్లా ఘల్లు...ఘల్లు...మని అడుగుల చప్పుడుతో ఇంట్లోకి నడచివచ్చింది ఒకామె. అన్నీతాన్నై పనులన్నీ చేసిపెట్టేది. నెచ్చెలిగా మారిపోయింది. కానీ....!

ఇంతవరకు అమ్మ, పిన్ని ఎవరోఒకరు బాబుని చూసుకోవటం వలన ఉదయం మెలకువ వచ్చేదికాదు. అలా అనేకంటే లేవలేదు, లేవలేకపోయాను అన్నదే నిజం.‘‘ఏయ్‌ రమా...బేబీ...నిద్రలేస్తావా?’’ ప్రవీణ్‌ చిన్నగా తట్టిలేపుతూ ఉంటే ఉలికిపడి లేచికూర్చున్నాను.‘‘అదేంటీ, కొంచెం ముందుగా లేపొచ్చుగా, మీకు లంచ్‌ చెయ్యాలి, టిఫిన్‌ చేయాలి..అయ్యో! టైమెలా సరిపోతుంది’’ విసుగ్గా, కోపంగా అన్నాను.‘‘పర్లేదులే, నేను క్యాంటిన్‌లో తినేస్తాను. బాబు ఇంకా లేవలేదుగా’’ చాలా అనునయంగా అన్నాడు.‘‘నేను ఆరుగంటలకే లేచాను. బాబుకి పాలుపడుతూ పదినిమిషాలు పడుకుందామని అనుకున్నాను, అలా నిద్రపట్టేసింది’’ అపాలజెటిక్‌గా అన్నాను.‘‘ఏమైంది రమా, పర్లేదన్నానుగా...’’ ప్రవీణ్‌ గొంతునిండా ప్రేమ, ఆప్యాయత. బాబుని చూస్కో, అదే పెద్దపని’’ అన్నాడు.

ఇంతలో ఘల్లుఘల్లుమంటూ గజ్జెలచప్పుడు. వెనువెంటనే వీధిగుమ్మం కర్టెన్‌ తొలగించుకుంటూ మెరుపులాంటి ఓ స్త్రీ లోపలికొచ్చింది. కళ్ళుచెదిరే అందం. అలాగే ఉండిపోయాను.‘ఎవరీమె?!’‘‘నేనెవరా? అని చూస్తున్నావా? ఇదిగో మీ ఆయన ప్రవీణ్‌కి దైవమిచ్చిన చెల్లెల్ని, ఇంకా నా గురించి చెప్పి ఉండడు. తర్వాత చెప్తాను నేనెవరో. ముందు ఈ టిఫిన్‌, ప్లేట్‌లోపెట్టి అన్నకియ్యి, లంచ్‌బాక్స్‌ ఇదుగో’’ అని తెచ్చినవి టేబుల్‌ మీదుంచింది.‘‘ఎందుకు సత్యా, ఇవన్నీ?’’ అన్నాడు ప్రవీణ్‌.‘‘కొంచెం పుణ్యం పోగుచేసుకుందామని..’’ నవ్వింది.

చక్కటినవ్వు, సొట్టబుగ్గలు, వంకీలు తిరిగిన ఉంగరాల జుట్టు, పెద్ద వాలుజడ, నల్లటికళ్ళు..ఇంక్‌ బ్లూ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. పాతసినిమాలో హీరోయిన్‌లా ఉంది. నిజంగా చెల్లెలేనా? అలాగే అనుకుంటున్నాడా? సందేహంగా ప్రవీణ్‌నే గమనిస్తున్నాను.నా చెయ్యి పట్టుకుని ‘‘పద పన్లున్నాయి కదా’’ అంటూ వంటగదివైపు తీసుకెళ్ళింది. ఆ చొరవ, చనువు.. కొంచెం అసహజంగా ఉంది, నచ్చలేదు’’.‘‘మేము ఈ మధ్యే ఈ ఇంటికొచ్చాం. నువ్వు పుట్టింట్లో ఉన్నావ్‌. అందుకే పరిచయం అవలేదు రమా’’ అంది. ‍‍‍