భుజానికున్న బరువైన బ్యాగ్‌ చేత్తోపట్టుకుని పరుగుతీశాడతను. సందులన్నీదాటి మెయిన్‌రోడ్డుకొచ్చాక మెల్లిగా నడవసాగాడు. తలనొప్పి, కాళ్ళు నొప్పులు. రైల్వేస్టేషన్‌కొచ్చి బెంచీమీద చతికిలబడ్డాడు. మనసులోశూన్యం. ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో అతడికి స్పష్టత లేదు. ఏదోఒక రైలెక్కేయాలని బుకింగ్‌ కౌంటర్‌వైపు నడుస్తూ పర్సు కోసం జేబులో చెయ్యిపెట్టాడు. అంతే! తలలో రెండు రైళ్ళు డీకొట్టుకున్నట్టు, ఊబిలో దిగబడిపోతున్నట్టు గిలగిలలాడిపోయాడు! ఎందుకని? అసలేంజరిగింది..?

*******************

ఆ లాడ్జి తీరు గమనిస్తే అందులోకి వచ్చేవాళ్ళెవరూ ఇష్టపూర్వకంగా వస్తారని చెప్పడానికి వీల్లేకుండా ఉంది. ఎండావానలకు రంగులు వెలిసి, అక్షరాలు అలుక్కుపోయి కేవలం ఒక మేకు ఆధారంగా వేలాడుతూ ఉన్నదా లాడ్జింగ్‌ నేమ్‌బోర్డు. ముందు సిపాయిల తిరుగుబాటు జరిగిందా.. లేక ఆ నేమ్‌బోర్దే ముందు రాశారా..అన్నది ఒక పట్టాన తేలే సమస్యలా కనిపించదు. పగలైనా, రాత్రైనాగానీ, జన సంచారం బొత్తిగా తక్కువగా ఉండే ఇరుకు వీధిలో ఉంది ఆ లాడ్జి.సమయం రాత్రి ఎనిమిది గంటలవుతోంది. కానీ ఆ వీధి మాత్రం అర్ధరాత్రిని తలపిస్తోంది. ఎలాంటి చడీచప్పుడు లేకుండా భయం పుట్టించే నిశ్శబ్దంతో శ్మశానంలో సమాధిని తలపిస్తోందా లాడ్జి. లాడ్జింగ్‌ ముందుభాగంలోని సోకాల్డ్‌ ఆఫీసుగదిలో నడివయసు పొట్టిమనిషి ఒకతను టేబుల్‌మీద తలానించి నిద్రలోకి జారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిన్నగదిలో లైటు దీర్ఘరోగిలా డిమ్ముగా వెలుగుతోంది.మరికొద్దిసేపటికే టేబుల్‌మీద తలానించిన మనిషి నిద్రలోకి జారినట్లుగా శ్వాస బరువుగా తీస్తున్నాడు.

అతని నోరు తెరుచుకుని ఉన్నది. బయట వీధిలో ఎలాంటి అలికిడీ లేదు. అక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని గమనిస్తే పట్టణంలో అదికూడా ఒక ప్రాంతమంటే నమ్మశక్యంగా ఉండదు. దీర్ఘ విరామాలనడుమ ఎప్పుడో ఒకటిరెండు మోటార్లుసైకిళ్ళు ఆ దారిలో పోతున్నాయి. ఆ నిర్జన వాతావరణంలో ఆ మూరుమూల లాడ్జిలో ఆ వ్యక్తి అట్లా టేబుల్‌మీద తల వేలాడేసి నిద్రపోవడంలో ఎంతమాత్రం అసహజంగా లేదు.ఆఫీసు అని పిలిచే ఆ గదిలో భరించలేనంత ఉక్కగా ఉన్నది. బొత్తిగా పీల్చడానిక్కూడా సరైన గాలి లేదక్కడ. వీధి లైట్లు కూడా సరిగాలేని ఆ గల్లీలోకి ఉన్నట్టుండి ఒక ఆటో ప్రవేశించింది. దడదడమని మోతపెడుతూ వచ్చి ఆ లాడ్జిముందాగింది. ఆటో చప్పుడుకు ఉలిక్కిపడి లేచాడావ్యక్తి. ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి నిలబడి పొట్టకిందికి జారిపోతున్న పాంటును పైకి లాక్కుంటూ మెట్లమీదికొచ్చి బజార్లోకి చూశాడు.