చీకటిని చూసి చీకటే భయపడేంత అర్థరాత్రి. అడవంటే అతడికి భయంలేదు. మిత్రులతో కలిసి ఎస్వీరంగారావు జీపులో వేటకు వెళ్ళాడు. దూరాన క్రూరమృగం అలికిడి. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎదురు నిలిచాడు. చంపి విజయగర్వంతో తిరిగిబయల్దేరాడు రంగారావు. కానీ అతడి అంతరాత్మ అతడిని నిలదీసింది! ప్రశ్నించింది! మరి ఆంతరాత్మ అడిగిన ఆ ప్రశ్నలకు రంగారావు చెప్పిన సమాధానాలేంటి?
*************************
చీకటి....కాటిక లాంటి చీకటి. పిరికివాడి భయంలా చిక్కగా ఉంది. అడవిలో నిశ్శబ్దం భరవసా చూసుకుని మరింత నల్లగా నవ్వుతోంది. ప్రమాద పరిస్థితిలో పసిపిల్లవాడి చిరునవ్వులా నింగిన చుక్కలు అమాయకంగా మెరుస్తున్నాయి. మొహం చెల్లక, కడుపులో ప్రమాదాలు దాచిపెట్టుకున్న చీకటి కూడ మిణుగురులతో ఇకిలిస్తోంది. పెద్దపెద్ద చెట్లు రూపు ధరించిన చీకట్లలా లీలగా కనబడి మాయమవుతున్నాయి.మంచు కురుస్తోంది. చలి కరుస్తోంది. గాలి సన్నగా వాడిగా రంపపుకోతలా ఒరుసుకుపోతోంది. చెవులమీద నుంచి చోటు దొరికినచోటల్లా గాఢంగా గుచ్చుకుంటోంది. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్‌లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయి. భయంగా.. భయంకరంగా...ఇలకోడి ఎదురుతాళంలో కూస్తోంది, భయసందేహాలవల్ల లయలేకుండా పడుతున్న మా అడుగుల సవ్వడిని కాబోలు ఆగి ఆగి ఆలకిస్తోంది.మెయిన్‌రోడ్డుమీద నడిచిన అలవాటువల్ల కాబోలు దారినిండా ఇన్ని గతుకులేమిటని విసుక్కుంటున్నాయి పాదాలు.వెనుక మేమున్నామన్న ధీమాతో బ్యాటరీలైటు కాంతికిరణం ఒకటి మాముందు చెంగుచెంగున ఎగురుతూ పోతోంది.
సాక్షాత్తు మృత్యువులాంటి పెద్దపులులు పచ్చటి ఎర్రటి కనుపాపలు పెద్దవి చేసుకుని ఊపిరి బిగబట్టి పొంచి ఉండే పొదలలోకి కూడా తొంగిచూసి వస్తోంది ఆ కిరణం.ఒక్క క్షణం ఆగాను, ఇంత చలిలోనూ కూడా చిరుచెమట పోసింది నొసట. అలసట చేత, భయం చేత కూడాను. రుమాలుతో మొహం తుడుచుకొని డబుల్ బారెల్ గన్‌ను ఆ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకున్నాను. ఆటవిక నిశ్శబ్ధం నన్ను చెవిటివాణ్ణి చేసింది. నా వెనుక వస్తున్న నా మిత్రుడు పొడి దగ్గు దగ్గాడు. ఉలిక్కిపడ్డాను.‘‘ఊ?’’ అన్నాను వెనక్కి తిరక్కుండానే.‘అబ్బే?’ అన్నాడు అతను.‘‘చలా?’’‘ఉహు’‘‘భయమెందుకోయ్’’ అన్నాను భయం అణచుకుంటూ.అతను నవ్వాడు ధైర్యం తెచ్చుకుంటూ. (అతనికిదే తొలిసారి) నాది భయమా? భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి? ధైర్యముంటే అతనెందుకు భయపడాలి? మేము అడవిని చూసి భయపడితే అడవి మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? అడవిలో పులులు ఎందుకు ముందుకు రావు? చీకటి నిశ్శబ్ధంలో, నిశ్శబ్ధం చీకట్లో ఎందుకు దాక్కున్నాయి? కుట్ర చేస్తున్నట్లుగా యెందుకీ నిశ్శబ్ధం? పొంచి ఉన్న ‘ప్రమాదాల’ మధ్య, మృత్యు పరికరాల మధ్య, అణగివున్న ఈ ప్రకృతి శక్తి–చైతన్యాల మధ్య రంగారావుకు చోటెంత? అణువంత. కాని అణువులో శక్తి ఎంత? ఆ సంగతి తెలిసే ధైర్యంగా అడవిలోకి ఆరుమైళ్ళ దూరం వచ్చానా?