‘ఇప్పుడు మల్లెపూలెందుకే?’ అన్నాడు చిదాత్మ.చివుక్కుమంది సుమనకి. మల్లెపూలు కాకపోతే ఆయనలా సిగరెట్లు కావాలా తనకి? ఐనా ఆడదాన్ని మల్లెపూలెందుకే అని అడగడమేమిటి? ‘తెల్లచీర కట్టినా... మల్లెపూలు పెట్టినా...’ అని ఒక కవిగారన్నట్లు, తను మల్లెపూలు పెట్టినా, చీర సింగారించుకున్నా ఎవరికోసమట? ఆయన కోసం కాదూ? కాని ఆయన సిగరెట్లు కాల్చేది మాత్రం తనకోసం కాదు. దగ్గరికి కూడా వెళ్ళలేనంత భయంకరమైన కంపుకోసం. ఊపిరితిత్తుల్ని పాడు చేసుకోవడం కోసం’.నిట్టూర్చింది సుమన. ఆ నిట్టూర్పులోంచి ఒక నైరాశ్యం పుట్టుకొచ్చింది.
అవును. తనకి ఆర్థిక స్వాతంత్ర్యం లేనందు వల్లే కదా, ఈ రోజు మల్లెపూలకి కూడా భర్తని దేవిరించాల్సిన పరిస్థితి వచ్చింది? అదే, తనకి కూడా ఒక సంపాదనంటూ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా?సుమనకి చిన్నప్పుడు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎంతో ఆశగా ఉండేది. కాని, ఆ రోజుల్లో ఆడది ఊపిరి పీల్చాలా వద్దా, ఆడదానికి చదువు అవసరమా, కాదా అనే చర్చలు, ఎనిమిదో తరగతి కాగానే ఓ అయ్య చేతిలో పెట్టేసి గుండెల మీద కుంపటిలాంటి బరువుని తీర్చేసుకోవాలనే తాపత్రయం కుటుంఆల్లో ఉండేవి. అందుకే పదహారేళ్ళకే తనకు ఈ చిదాత్మతో వివాహం అయిపోయింది. అప్పటినించీ సుమనకి తీవ్రమైన అసంతృప్తి. తన చేతులతో తను నాలుగు డబ్బులు సంపాదించుకోలేక పోతున్నానే అన్న బాధ. ఏం కావాలన్నా భర్త దగ్గర చేయి దాచవలసి వస్తోందే అన్న వేదన.
తన చదువుకి వివాహం అడ్డమైందన్న అసంతృప్తి కోపంగా మారి ఆ కోపం ఆమె భర్తమీదకు మళ్ళింది. తన భవిష్యత్‌కి, తన ఆశయాలకి రాక్షసుడులా ఈ మొగుడు గారొచ్చి అడ్డుపడ్డాడని ఆయన మీద కక్ష పెంచుకుంది సుమన.ఇప్పుడింక తనది ఉద్యోగం చేసే వయసు కూడా కాదాయె. మనసు మళ్ళించుకోడానికి ఆ రోజే వచ్చిన వారపత్రిక ‘కాలక్షేపం’ చేతిలోకి తీసుకుంది. అందులో కథల పోటీ తాలూకు ఫలితాలు పడ్డాయి. అప్పుడు గుర్తొచ్చింది తను కూడా కథ పంపిన సంగతి. ఆత్రంగా పేజీలు తిరగవేసి చూస్తే, తన కథకి ప్రత్యేక బహుమతి వెయ్యి రూపాయలు వచ్చింది! సుమనకి ఏనుగెక్కినంత సంబరం వచ్చింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తన భర్తకి చెప్పకూడదు. ఏం సంతోషిస్తాడు కనక?