నడక మందంగా వుంది. అనుకున్నంతగా అందుకోవడం లేదు. ఒక మెట్టు పూర్తి చేసి మరో మెట్టు మీద పాదం పెట్టి అక్కడి నుంచి ఇంకో మెట్టు మీద పాదం ఆన్చుకుని, కొన్నిక్షణాలు ఊపిరి పీల్చుకుని, మధ్యలో ఇనప ఊచల సహాయ సహకార సౌజన్యాలకు కృతజ్ఞతలు పంచుకుని.. ఇలా దశలుదశలుగా ఆచి తూచినట్టే సాగుతోంది.చుట్టూ అంతా వణికించే చల్లదనం. కింద జారుడుమెట్లు. పసుపు, కుంకుమ, సిందూరం, చందనం, కర్పూరభస్మం అన్నీ కలిసి అరిపాదాలకి లేపనం పూస్తున్నట్టుంది. జారుడుగా వున్న ప్రతిమెట్టూ జాగ్రత్తగా అడుగేయాల్సిన బాధ్యతని గుర్తుచేస్తోంది. అందుకే గబగబలూ వడివడులూ చకచకలూ త్వరత్వరలూ లేకుండా స్థిరంగా నిమ్మళంగా ఒబ్బిడిగా తాయితీగా ఈ ప్రయాణం.చినుకు చినుకు పడుతూనే వుంది. తగ్గనూ లేదు. కుండపోతకీ వెళ్లదు. కొండల్లో ఎటు చూసినా మబ్బులు వనవిహారం చేస్తున్నాయి.. పచ్చదనానికి వెండి ఆభరణాల్లా తెల్లటి మబ్బులు! రంగురాగాల కచ్చేరీలే ఎటు విన్నా. శిఖరాలెక్కడో తేలనంతగా ఎన్నో కుంచెలు కూడబలుక్కుని వేసిన వర్ణచిత్రంలా వుందెటు చూసినా.క్షణానికో మంచుతెర అట్నుంచిటు సుతారంగా కదలి వెళ్లిపోతోంది. ఈ పలకరింపుతో ఒక్కసారిగా ఎన్నో పులకల మొలకలు! చలికి వాన కూడా తోడై నాలో ప్రకృతి ప్రేమికుడు బాగానే జడలు విప్పుకుంటున్నాడు గానీ, నాలో ఒక సగటు భక్తుడు మాత్రం వేగాన్నెలా పెంచాలో ఆలోచిస్తున్నాడు - వర్తించే షరతులకు లోబడి.మెట్లు పదా? పరకా? వందా? వెయ్యా? అక్షరాలా మూడువేల ఐదొందల యాభై.నాతో వచ్చిన వశిష్ఠ మాత్రం నాకంటే రెండు మెట్లు ముందే వున్నాడు. నాతోవచ్చిన అంటే ఎక్కడి నుంచో రాలేదు. తను తిరుమల లోనే వేదపాఠశాలలో వేదం చెబుతాడు. ఎక్కడో కోనసీమలో ఓ మారుమూల కాలేజీలో కామర్స్‌ లెక్చరర్ని.. నేనూ ఇక్కడికి వచ్చింది. ఇద్దరం కలిసి చదువుకున్నాం. తను ఇటొచ్చాడు. నేను అటు వెళ్లాను. అంటే భౌతికంగా ప్రాంతాల గురించి కాదు. మానసికంగా స్థిరపడిన వృత్తుల గురించి.ఓసారి పెద్దాయన్ని చూడాలని వుంది అని వశిష్ఠతో అంటే - వెంటనే బయల్దేరి వచ్చేయమన్నాడు. దరిమిలా ఈ ప్రయాణం. పెద్దాయన అంటే ఆ స్వామి. పైగా ఎలాంటి ఉత్తరాలూ ఉత్తర్వులూ అవీ అదనంగా ఏం లేకుండా ఆయన్ని దర్శించుకోవాలన్న ప్రయత్నం.. దేవుడి దగ్గర కూడా అడ్డదారెందుకూ? అదీ ఆలోచన.

                                 ********************************************************