‘‘అమ్మమ్మగారూ .. మీరేమిటి ఇక్కడున్నారు?’’అందరికీ దూరంగా, వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న రాజేశ్వరమ్మ ఆ మాటకి తలెత్తి చూసింది. ఎదురుగానిలబడ్డ అమ్మాయిని గుర్తుపట్టలేక -‘‘ఎవరమ్మా నీవు... నన్నెవరనుకుంటున్నావు?’’ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది.

‘‘నా పేరు వందన .. మీరు శ్రీనగర్‌కాలనీలో వుండేవారు కదా, మా అమ్మమ్మ వరలక్ష్మి గారింటి పక్కన ..’’ కుతూహలంగా అంది ఆ అమ్మాయి.‘‘ఆ .. అవునవును, సుబ్రమణ్యంగారు, రిటైర్డ్‌ జడ్జి, వరలక్ష్మిగారి మనవరాలివా?’’ ఆశ్చర్యానందాలతో అంది రాజేశ్వరమ్మ.‘‘అవునండి. మా అమ్మ సునీతతోకలిసి శలవలకి అమ్మమ్మ గారింటికి వచ్చినపుడల్లా చాలాసార్లు మిమ్మల్ని చూశాను. అప్పుడు చిన్నదాన్ననుకోండి, అయినా మిమ్మల్ని చూడగానే గుర్తు పట్టాను’’ అంది వందన.‘‘చాలా సంతోషం తల్లీ ... మీ అమ్మమ్మగారు పోయాక నాకు మాటా - మంచీ చెప్పుకునే తోడు కరవయ్యారు. అప్పటినించీ మీరంతా రావడమూ తగ్గిపోయింది. అంతే మరి, తల్లి పోతే తరం పోతుందంటారు. మీ తాతగారూ, అమ్మమ్మా రెండేళ్ల తేడాలో పోయారు. దాంతో ఆ యింటి కళే పోయింది. యిప్పుడు మీ మామయ్య వున్నారనుకో.

అంతేనమ్మా .. ఆడపిల్లలకి తల్లి వున్నన్ని రోజులే పుట్టిల్లు .. అన్నట్టు, ఇక్కడికెందుకు ఒచ్చావమ్మా?’’ పాత బంధువుని చూసినట్టు ఆప్యాయంగా అంది రాజేశ్వరమ్మ.‘‘నేనొక టి.వి. ఛానల్లో పనిచేస్తున్నానండి. ఈ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ కవరేజ్‌ పోగ్రాం వుంటే, షూటింగని వచ్చాను. అవునూ, మీరేమిటిక్కడ! మీ యిల్లూ .. మీ వారూ ..’’ ఆశ్చర్యంగా అడిగింది.రాజేశ్వరమ్మ విరక్తిగా నవ్వి నిట్టూర్చింది.‘‘మా వారూ లేరు, మా యిల్లూ లేదు యిప్పుడు. అలా కుర్చీ లాక్కొని కూర్చోమ్మా...’’‘‘అదేమిటి ...’’ కుర్చీలో కూర్చుంటూ అడిగింది వందన.‘‘అవునమ్మా, ఆయన పోయి నాలుగేళ్లయింది, యిల్లు పోయి ఆర్నెల్లయింది.’’‘‘మీ అబ్బాయి, అమ్మాయి వుండాలిగా..’’ తెల్లబోయింది వందన.‘‘అమ్మాయి దాని కాపురం అది చేసుకుంటూ బెంగుళూరులో వుంది. అబ్బాయిక్కడే వున్నాడు.’’‘‘మరి?’’‘‘వదిలేయమ్మా, అవన్నీ ఎందుకిక్కడ. చీకూ చింతా లేకుండా, నిశ్చింతగా, ప్రశాంతంగా బాగుందిక్కడ ...’’ బలవంతంగా నవ్వింది ఆవిడ.‘‘ఆ యిల్లు ఏమయింది?’’ వదలకుండా అడిగింది వందన.

‘‘ఆ యిల్లు లేదమ్మా, ఆ పక్కన ఎవరో స్థలం అమ్ముకుంటే మా స్థలం కూడా కలిపి అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. మాకు రెండు అపార్ట్‌మెంట్స్‌ యిస్తారట. పాత ఇంటి బదులు అనగానే ఎవరికైనా ఆశే గదమ్మా ... మా వాడూ మరి దానికి అతీతుడు గాదు గదా! నేనున్నన్ని రోజులూ వుండనీయరా అని బతిమాలా ... ‘మంచి ఛాన్స్‌. ఉట్టి మన యిల్లుయితే 250 గజాలే, ఎవరు కొంటారు? పక్కది, యిది కలిస్తే వెయ్యి గజాలు. అందుకే బిల్డర్‌ కొని అపార్ట్‌మెంట్స్‌ కట్టడానికి ముందుకొచ్చాడు’ అంటూ ఊదరగొట్టాడు. నేను రాలిపోయేదాన్ని, వాళ్లకి బోలెడు భవిష్యత్తుంది. వాడి ఆశలకీ, కోరికలకీ