ముందుగా మా విశ్వనాథంగురించి చెప్పి, ఆ తర్వాత అసలు విషయంలోకి వస్తాను. స్కూల్లో కలిసి చదువుకున్నప్పటినుంచీ సాగుతున్న స్నేహం మాది. ఒకేచోట నివాసంవల్ల తరచుగా కలుసుకుంటూనే ఉంటాం.చిన్నప్పుడు ఎటువంటి గుణాలు ఉండేవో, ఇప్పటికీ ఆ గుణాలు విశ్వనాథాన్ని వదల్లేదు.
తనకి ఎంతమాత్రం అవసరంలేని పనుల్లో తలదూరుస్తుంటాడు. చివరికి అభాసుపాలై, తప్పంతా వీడిదే అన్నట్టు ఎన్నోసార్లు ఇబ్బందులుపడుతూ ఉంటాడు. అయినా తన పద్ధతి మార్చుకోడు. తనమీదే కాదు. అన్నిటిమీదా, అందరిమీదా విపరీతమైన నమ్మకం. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మనిషి చెడ్డవాడు కాదని. కానీ, చాలాసార్లు వాడు చెప్పినట్టే చేశాం. కానీ చివరకు మాకు మిగిలినవి ఇబ్బందులే. దరిదాపు ఏభైఏళ్ళ క్రితం జరిగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తే. విశ్వనాథం గుర్తుకు రాగానే ఆ సంఘటనే జ్ఞాపకం వస్తుంది.
అవి నేను ఉద్యోగంలో చేరిన కొత్తరోజులు. ఇంకా నాకు పెళ్ళి కూడా కాలేదు. సెలవుంది. చేతిలో డబ్బుంది. ప్రయాణానికి పాస్ ఉంది. అందుకని ఊరికే ఢిల్లీ చూసివద్దామని ప్రయాణమయ్యాను. అప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎక్కువ రైళ్ళు కూడా లేవు. పొద్దున్నే ఎక్కితే రెండో రోజుకి ఢిల్లీకి చేరేవాళ్ళం. నేను రైలెక్కి కూచున్న పావుగంటలోపే విశ్వనాథం కనిపించాడు. టాయిలెట్‌కి వెడుతూ తనే నన్ను చూశాడు.‘‘అరే నువ్వూ ఇదే రైల్లో ప్రయాణమా’’ అన్నాడు.నవ్వుతూ తలూపాను. నెమ్మదిగా తన పెట్టె, నేనున్న చోటుకే తెచ్చేసుకుని, నా పక్కనే సెటిలైపోయాడు. ఇంక కబుర్లు.ఆ కబుర్లలో నేను ఢిల్లీ వెడుతున్నాని చెప్పాను. ‘‘ఎందుకు’’ అని అడిగాడు విశ్వనాథం. ఊరికే అని చెప్పాను. ‘‘అయితే ఓ పని చెయ్యి’’ అన్నాడు. ఏమిటన్నట్టు చూశాను.