క్యాలెండరు కమిటీ మీటింగుకి ఈసారి ఒఠ్ఠి కాలెండరు కమిటీ సభ్యులనే కాక, మొత్తం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులనందరినీ ఆహ్వానించారు.‘‘ఇదేంటి కొత్తగా? కాలెండర్ కమిటీ మీటింగులో మనం చేసెడిదేముంటది?’’ అడిగాడొకాయన తోటి సుభ్యుణ్ణి.‘‘భలే వోడివే! మీటింగ్ల పిలిస్తే ఎల్లాల. చా బిస్కట్లు, గరం పకోడా, ఆలూ సమోసా... ఏది పెడితే అది మస్తు లాగించాల. మనసొస్తే మాట్లాడాల. లేదంటే గమ్మునుండి పోవాల. అంతే గద...’’ ఫెళ్లున నవ్వాడు తోటి సభ్యుడు.
బుర్ర గోక్కుని, దాన్నే వోసారి వెనక్కీ, ముందుకీ ఆడించాడు ‘ఒహాయన’.మీటింగు మొదలయింది.‘‘సభ్యులందరికీ గౌరవాభివందనాలు...’’ మొదలుపెట్టాడు సెక్రటరీ. ‘‘మేనేజ్‌మెంటుతో మొన్న జరిగిన సమావేశంలో పై సంవత్సరానికి ఇవ్వవలసిన పండుగ సెలవుల లిస్టు ఖరారు చేయడం జరిగిందని మీ అందరికీ విన్నవించటం జరుగుతోంది.ఇహ ఆ సెలవులని మార్క్‌చేస్తూ మన యూనియన్ కాలెండరు తయారు చేయవలసి ఉంది.ఈసారి ఒక్క పండగ కూడా శని, ఆదివారాలలో రాకపోవటం సంతోషకరమైన విషయం.‘పండగలు శనాదివారాల్లో రాకపోతే ఏమైతది? వస్తే ఏమతది? మన సెలవులు పదహారు మనకి రిజర్వుడే గద – పండగలు శనాదివారాల్ల వొస్తే – మరోపేరుతో మన సెలవు దొరుకు డేనాయె! ఇండ్ల సంబర పడెదిదేంది?’పెదవి విరిచాడు ‘ఒహాయన’.
అది గొణుగుడే గనుక ఎవ్వరికీ వినబడలేదు.‘‘అంతేకాదు, ఈసారి పది పండగలు గురువారం, శుక్రవారం, సోమవారం లేదా మంగళ వారం వచ్చాయి. అంటే, అన్నిసార్లు మనకి మూడేసిరోజులు వారాంతపు సెలవులూ, ఒకోసారి ఒక్కరోజు సెలవుపెడితే ఏకంగా నాలుగురోజులు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయాన్నమాట!’’అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.చప్పట్లు ఆగాక, గొంతు సవరించుకుని, మళ్ళీ కొనసాగించాడు సెక్రటరీ.‘‘ఈసారి కాలెండర్ ప్రచురణలో కొన్ని విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టాలని ప్రతిపాది స్తున్నాం. అందుకే ఈసారి కే.క (ల) సభ్యులతో పాటూ ఆ. క (లి) సభ్యులనీ ఆహ్వానించాం!’’అందరూ ఆసక్తిగా చూసేదాకా ఆగి, అప్పుడు మొదలు పెట్టాడు.‘‘సాధారణంగా మన కేలండర్లో పని దినాలని నలుపు రంగులో, పండగలు, సెలవు దినాలని ఎరుపురంగులో ముద్రిస్తాం కదా! కానీ, ఈసారి మన యూనియన్ కాలెండర్లో రంగుల స్కీమ్ మార్చాలని ప్రతిపాదిస్తున్నాం.